
Bull Market: గడచిన వారం ఇండియా-పాక్ మధ్య యుద్ధ వాతావరణం దేశీయ స్టాక్ మార్కెట్లను కొంత ఒడిదొడుకులకు లోను చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో డ్రోన్ స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ షేర్లు మాత్రం భారీ పెరుగుదలను నమోదు చేశాయి. దాదాపుగా చేతులెత్తేసిన పాక్ పరిస్థితితో అక్కడి స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరటంతో భారత స్టాక్ మార్కెట్లలో బుల్స్ జోరు కొనసాగుతోంది.
ఉదయం 9.55 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2150 పాయింట్ల లాభంతో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 665 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1537 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1632 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెడ్ వంటి కంపెనీల షేర్లు ఇంట్రాడేలో భారీ లాభాలను నమోదు చేశాయి. ఇదే క్రమంలో గడచిన 16 రోజులుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులను కొనసాగించటం బలమైన ర్యాలీకి దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు నికరంగా రూ.14వేల167 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.
ఈ వారం మార్కెట్ల దారెటు..
దీంతో పాటు అమెరికా, చైనా మధ్య టారిఫ్‌లకు సంబంధించి ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి. ఇది కూడా సానుకూల పరిణామం. మరోవైపు దేశ మాక్రో ఎకనామిక్ డేటా ప్రకటనలు, కంపెనీల క్యూ4 రిజల్ట్స్, విదేశీ ఇన్వెస్టర్ల కదలికలు, గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ కూడా ఈ వారం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని ఎనలిస్టులు చెబుతున్నారు. " భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెరుగుపడుతుంది. ఫైనాన్షియల్ మార్కెట్లకు ఇది పెద్ద సానుకూల పరిణామం. గతంలో ఇలాంటి జియోపొలిటికల్ డీ-ఎస్కలేషన్స్ తర్వాత మార్కెట్లు తమ నష్టాల నుంచి రికవర్ అయ్యాయి" అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వీపీ రీసెర్చ్ ప్రశాంత్ తపసే అన్నారు. అంటే చర్చలు సానుకూలంగా కొనసాగితే ఇదే బుల్ జోరు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగవచ్చని తెలుస్తోంది.
►ALSO READ | ఆర్థా గ్లోబల్ ఫండ్‌తో 6 రెట్ల రిటర్న్