Market Fall: అమెరికా నుంచి టారిఫ్స్ నోటీసులు.. స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్-నిఫ్టీ క్రాష్..!

Market Fall: అమెరికా నుంచి టారిఫ్స్ నోటీసులు.. స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్-నిఫ్టీ క్రాష్..!

Sensex Crash: రష్యా నుంచి చమురు కొనుగోలును వ్యతిరేకిస్తూ అమెరికా భారతదేశంపై సెకండరీ టారిఫ్స్ కింద అదనంగా 25 శాతం సుంకాలను కొద్ది రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇవి ఈనెల 27 నుంచి అమలులోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా నుంచి దీనిపై నోటీసులు వచ్చాయి. ఆగస్టు 27, 2025 ఈస్ట్రన్ టైమ్ ప్రకారం తెల్లవారుజామున 12.01 నుంచి వినియోగానికి వచ్చే భారతీయ ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలు వర్తిస్తాయని యూఎస్ హోమ్ లాండ్ సెక్రటరీ తన నోటీసులో స్పష్టం చేసింది. దీంతో భారత ఉత్పత్తులపై అమెరికాలో ఏకంగా 50 శాతానికి చేరనున్నాయి. 

అమెరికా నుంచి సుంకాలపై వచ్చిన నోటీసులు భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఉదయం 9.36 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 605 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 185 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ అవుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 560 పాయింట్లు నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 690 పాయింట్ల భారీ నష్టంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలోని అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. 

ప్రధానంగా భారతీయ స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు ట్రంప్ టారిఫ్స్ ప్రభావంపై ఆందోళనలు చెందుతూ తమ పెట్టుబడులను అమ్ముకుంటున్నారు. కొందరు నష్టాలను నివారించటానికి ఇలా చేస్తుంటే మరికొందరు లాభాలను బుక్ చేసుకుని కొత్త అవకాశాల కోసం సిద్ధం కావటానికి అమ్మకాలకు దిగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరో వైపు భారత ప్రభుత్వం మాత్రం తమ ఇంధన అవసరాల కోసం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా క్రూడ్ ఆయిల్ కొనుక్కునే స్వేచ్ఛ తమకు ఉందని పశ్చిమదేశాలకు ఒక న్యాయం భారతదేశానికి మరో న్యాయం అంటే కుదురదని గట్టిగానే తననిర్ణయంపై కొనసాగుతోంది.