
భారత ఆటోమొబైల్ రిటైల్ రంగం సెప్టెంబర్ 2025లో గత ఏడాదితో పోల్చితే 5.22% వృద్ధి సాధించింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. సెప్టెంబర్‌లో మొత్తం 18,27,337 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 2024 ఇదే నెలలో 17,36,760 యూనిట్ల రిజిస్ట్రేషన్లతో పోల్చితే ఈ ఏడాది అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్లు దీని ప్రకారం తెలుస్తోంది.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రయాణికుల వాహనాలు 5.80% వృద్ధితో 2,99,369 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక రెండు చక్రాల వాహనాల అమ్మకాలు 6.51% పెరిగి 12,87,735 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సమృద్ధిగా కురిసిన వర్షాలు.. బలమైన ఖరీఫ్ పంట, స్థిరమైన వడ్డీ రేట్లు ప్రజల కొనుగోలు శక్తిని పెంచినట్లు FADA పేర్కొంది. దీనికి తోడు అక్టోబరులో ధన్తేరస్, దీపావళి ఉన్నందున అమ్మకాలు సరికొత్త రికార్డు స్థాయిలను చేరుకోవచ్చని కూడా సంస్థ అంచనా వేస్తోంది.
ALSO READ : ఈ ఐపీవోని నమ్ముకున్నోళ్లకు భారీ లాస్..
జీఎస్టీ 2.0 బూస్ట్ తర్వాత నవరాత్రి సమయంలో రిటైల్ విక్రయాలు 34.01% పెరిగి 11,56,935 యూనిట్లుకు చేరాయి. ఇందులో ప్రయాణికుల వాహనాలు 34.87%, టూవీలర్లు 35.95% వృద్ధిని సాధించాయి. వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలు కూడా డబుల్ డిజిట్ గ్లోత్ చూశాయి ఈ సారి దసరా పండుగకు.
కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యాక ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా కోటి 23లక్షల 48వేల306 వాహనాలు అమ్ముడయ్యాయి, ఇది గతేడాది కంటే 3.42% ఎక్కువ. ట్రాక్టర్లు 10.68% వృద్ధితో ముందంజలో ఉండగా, త్రీ-వీలర్లు 3.86%, ప్రయాణికుల వాహనాలు 3.67% వృద్ధి సాధించాయి. మరోపక్క ఎలక్ట్రిక్ వాహనాల శాతం పెరుగుతోంది. త్రీ-వీలర్‌లలో 61.74% అమ్మకాలు EVలవి కాగా, టూవీలర్లలో ఈవీల వాటా 8.09%, ప్రయాణికుల వాహనాల్లో 5.12 శాతానికి పెరిగింది. మెుత్తం మీద డీజిల్ వాహనాలు అమ్మకాల్లో ఆధిపత్యం చెలాయించగా.. టూవీలర్లు, కార్ల మార్కెట్లో పెట్రోల్ వేరింట్లు మంచి డిమాండ్ చూశాయి.