బీజేపీ అగ్రనేతల వరుస టూర్లు.. మూడు రోజుల్లో ఆరు సభల్లో పాల్గొననున్న ప్రధాని

బీజేపీ అగ్రనేతల వరుస టూర్లు.. మూడు రోజుల్లో ఆరు సభల్లో పాల్గొననున్న ప్రధాని
  • 25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో మోదీ ప్రచారం
  • 24, 26, 28 తేదీల్లో అమిత్ షా
  • 23, 25, 26, 27 తేదీల్లో జేపీ నడ్డా
  • 22న వరంగల్​లో బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు బీజేపీ అగ్ర నేతల వరుస టూర్లు ఖరారయ్యాయి. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. ప్రచారం ముగింపు దశలో మరోసారి ఈ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. అయితే, వీరు ఏ రోజు ఏ సభలో పాల్గొంటారనేది ఫైనల్ కావాల్సి ఉంది. దీనిపైనే రాష్ట్ర బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తున్నది. అగ్రనేతల వరుస టూర్లతో రాష్ట్రంలో కమల దళం ఎన్నికల స్పీడ్ ను పెంచినట్లయింది. ప్రధాని మోదీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో 3 రోజుల్లో ఆరు సభల్లో పాల్గొననున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం నిర్మల్, కరీంనగర్, మెదక్ సభల్లో, హైదరాబాద్​లో రోడ్ షోలలో పాల్గొనే అవకాశం ఉంది. త్వరలోనే మోదీ టూర్ షెడ్యూల్ అధికారికంగా రానుందని చెప్తున్నారు. ఈ 3 రోజులు ప్రధాని రాజ్​భవన్​లో బస చేయనున్నట్లు సమాచారం.

ఇంకా ఖరారు కానీ సభలు

కేంద్ర హోంమంత్రి అమిత్​షా కూడా ఈ నెల 24, 26, 28 తేదీల్లో రాష్ట్రానికి చివరి దశ ప్రచారం కోసం రానున్నారు. ఆయన పాల్గొననున్న సభలు ఎక్కడా అనేది ఇంకా ఖరారు కాలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 23,25,26,27 తేదీల్లో రాష్ట్రంలో వివిధ సభల్లో పాల్గొననున్నారు. నడ్డా ముథోల్, సంగారెడ్డి, నిజామాబాద్ అర్బన్ సభలతో పాటు హైదరాబాద్ రోడ్ షో లో పాల్గొననున్నారు. ఏ రోజు ఏ సభ అనే ది ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 22 న వరంగల్ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 26 న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి జనసేన అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 24, 25, 26 తేదీల్లో రాష్ట్రానికి రానున్నారు. అయితే ఆయన పాల్గొననున్న సభలు ఫైనల్ కాలేదు. ఈ నెల 22 నుంచి 27 వరకు అస్సాం సీఎం  హిమంత్ బిశ్వ శర్మ ఎన్నికల ప్రచారంలో  పాల్గొననున్నారు. సభలు ఖరారు కావాల్సి ఉంది. మంగళవారం (21న) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి రానున్నారు. ముషీరాబాద్​లో దేవేంద్ర ఫడ్నవీస్, జూబ్లీహిల్స్ లో నిర్మలా సీతారామన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.