
- పని భారం సెర్ప్ సిబ్బందికి
- మిత్తి పైసలు బ్యాంకులకు
- పేపర్ వర్క్, లోన్ రికవరీకి కూడా సర్వీస్ చార్జీలు ఇస్తలే
- లింకేజీ లోన్ల పై 3.5% సెర్ప్‌కు ఇవ్వాలన్న జీవోలు మూలకు
- సంస్థకు ఏటా రూ.350 కోట్లు నష్టం
హైదరాబాద్, వెలుగు: సెర్ప్ సిబ్బందితో లోన్లకు సంబంధించిన పేపర్‌వర్క్, లోన్ రికవరీ పనులు చేయించుకుంటున్న బ్యాంకులు.. వారికి ఇవ్వాల్సిన సర్వీస్ చార్జీలు మాత్రం ఇవ్వడం లేదు. ఏటా మహిళా సంఘాలకు బ్యాంకులు వేల కోట్ల రూపాయల లోన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకు లోన్ తీసుకునే ప్రతి గ్రూప్ కోసం డాక్యుమెంటేషన్ పనులు చేసేది సెర్ప్ సిబ్బందే. అలాగే తీసుకున్న లోన్ రికవరీ అయ్యేలా చూసేది వారే. బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది చేయాల్సిన పనిని సెర్ప్ ఉద్యోగులే చేస్తున్నారు. ఏటా పది వేల కోట్ల రూపాయల లోన్లు ఇస్తూ, వాటికి మిత్తిని బరాబర్ వసూలు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్న బ్యాంకులు.. సెర్ప్ సిబ్బంది చేస్తున్న పనికి కనీసం సర్వీస్ చార్జీలు కూడా ఇవ్వట్లేదు. ఇస్తున్న లోన్లలో 3.5 శాతాన్ని సర్వీస్ చార్జీల రూపంలో సెర్ప్ కు చెల్లించాలని ఉమ్మడి ఏపీలో 2013లోనే ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేసినా అవి ఇప్పుడు అమలు కావడం లేదు.
లాభాలు వస్తున్నా..
బ్యాంకులు మహిళా సంఘాలకు ఇస్తున్న లోన్లలో గ్రామ సమాఖ్యలకు 0.5 శాతం, సెర్ప్ కు 3 శాతం చెల్లించాలని 2013లో ప్రభుత్వం జీవో నం:294, 322 విడుదల చేసింది. ఈ రెండు జీవోలను సరిగ్గా అమలు చేస్తే సెర్ప్ ఖాతాలో- ఏటా రూ.350 కోట్లపైనే జమయ్యేవి. కానీ ఏండ్లు గడుస్తున్నా ఇటు ప్రభుత్వాలుగానీ, అటు బ్యాంకులుగానీ వాటిని పట్టించుకోవడం లేదు. స్వయం సహాయక సంఘాల వద్ద 12 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తూ ఏటా మహిళా సంఘాల పై రూ.1300 నుంచి రూ.1500 కోట్ల వరకు లాభాలు ఆర్జిస్తున్నాయి. మహిళా సంఘాలకు ఎలాంటి సర్వీస్ ఇవ్వకుండానే 2 శాతం సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్న బ్యాంకులు ఆ డబ్బులు కూడా సెర్ప్ కు ఇవ్వడం లేదు. మరోవైపు 21 ఏండ్లుగా సేవలందిస్తున్న సెర్ప్ సిబ్బంది కనీస వేతనానికి కూడా నోచుకోవడం లేదు. బ్యాంకులు తాము చేసి పెడుతున్న డాక్యుమెంటేషన్, రికవరీకి సర్వీస్ చార్జీలు ఇస్తే.. ఆ డబ్బులతో గ్రామ సమాఖ్యలు, వారి వద్ద పని చేస్తున్న వీవోఏ ల వేతనాలు చెల్లించవచ్చని, సెర్ప్ ఉద్యోగుల జీతాలు పెంచవచ్చని, సౌలత్లు కల్పించుకోవచ్చని సెర్ప్ ఉద్యోగుల జేఏసీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.