బ్యాక్​వాటర్​తో నీటమునిగిన ఏడు గ్రామాలు

 బ్యాక్​వాటర్​తో నీటమునిగిన ఏడు గ్రామాలు
  • బ్రిడ్జిలు, రోడ్లపై ప్రవహిస్తున్న వరద
  • దాదాపు అన్ని ఊర్లకు రాకపోకలు బంద్​
  • సార్లు రాక తెరుచుకోని బడులు ..ఇండ్లల్లోనే విద్యార్థులు
  • మూడు వేల ఎకరాల్లో మునిగిన పంటలు 

ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు:  ప్రాణహిత.. తీర ప్రాంత రైతులు, ప్రజలను కన్నీరు పెట్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాక్ వాటర్ ముంచేస్తోంది. దీంతో రెండు మండలాల్లోని ఏడు గ్రామాల ప్రజలు దినదిన గండంగా గడుపుతున్నారు. అన్నిచోట్లా జనజీవనం స్తంభించింది. వాగులు వచ్చినప్పుడల్లా స్కూల్స్​ బందవుతున్నాయి. నాటుపడవల మీద ప్రయాణం కొనసాగించాల్సి వస్తోంది. అనారోగ్యానికి గురైనా..పాములు, తేళ్లు కరిచినా ఆర్ఎంపీలే దిక్కవుతున్నారు. అత్యవరస పరిస్థితుల్లో దేవుడి మీద భారం వేసి వదిలేస్తున్నారు.  

రెండు మండలాల్లో పరిస్థితి తీవ్రం

గతంలో కురిసిన వర్షాలకు వచ్చిన వరదలతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్, చింతలమానేపల్లి మండలంలోని ప్రాణహిత ఒడ్డున ఉన్న పంట పొలాలు, చేన్లలో వరద చేరి ఒండ్రు మట్టి, ఇసుక మేటలు వేయడంతో చాలా మంది రైతులు నష్టపోయారు. ప్రస్తుతం వానలు లేకపోయినా ప్రాణహిత బ్యాక్ వాటర్ ఉధృతితో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. దీంతో బెజ్జూర్​ మండలం మోగవెళ్ళి, నాగెపల్లి, సోమిని, తలాయీ, తిక్కపల్లి గ్రామాలు.. చింతలమానేపల్లి మండలంలోని దిందా, కోయపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఈ ఊర్లకు టీచర్లు రాలేక స్టూడెంట్స్​ ఇండ్లకే పరిమితమయ్యారు. బెజ్జూరు మండలంలోని సుస్మిర్ ఒర్రె ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. తలాయి లో లెవెల్​బ్రిడ్జి నీట మునిగింది. ఇక్కడ హైలెవెల్​బ్రిడ్జి కట్టాల్సి ఉండగా లోలెవెల్​బ్రిడ్జి కట్టడంతో ఈ పరిస్థితి నెలకొంది. బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ కారణంగా సుమారు మూడు వేల ఎకరాల పత్తి పంట నీట మునిగింది.  

దిందాలో అగమ్యగోచరం

చింతలమానేపల్లి మండలంలోని దిందా గ్రామమైతే తొమ్మిది రోజులుగా నీళ్లలోనే ఉంది. గ్రామస్థులు బెజ్జూరు, కాగజ్​నగర్​లకు వెళ్లి రావడానికి ఇరవై రూపాయలు పెట్టి నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడి పిల్లలు బడికి వెళ్లక పది రోజులకు పైగానే అయ్యింది.  

బాధలకు అలవాటు పడుతున్నం
మా ఊరికి వానాకాలం వస్తే శని పట్టుకున్నట్టే...ఊరు దాటి వెళ్లలేం. సర్కార్ బడికి రావాలంటే సార్లు వాగు దాటాలి..
ఆ అవకాశం లేకపోవడంతో బడి మూత పడింది. దాదాపు పది రోజులుగా పిల్లలు బడికి పోవడం లేదు.  ఇలా ప్రతిసారి వచ్చే ఇబ్బందులను అలవాటు చేసుకుంటున్నం. మేము ద్వీపంలో ఉన్నామా అని అనిపిస్తుంటుంది. ఇప్పటికే పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫారెస్ట్ పర్మిషన్ వచ్చి హై లెవెల్ బ్రిడ్జి అయితేనే కష్టం తీరుతది.   – వెంకటేశ్, యువకుడు, దిందా గ్రామం

పత్తి పంట మొత్తం పోయినట్లే...
వానలు, వరద, ప్రాణహిత బ్యాక్ వాటర్ తో పత్తి పంట మొత్తం దెబ్బతిన్నది. నేను అప్పు చేసి పంట వేసిన. నదికి దగ్గరలో ఉండడంతో చేను పూర్తిగా బురదతో నిండిపోయింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పటికీ మూడు సార్లు పంట నీట మునిగిపోయింది. నాతో పాటు వందల మంది రైతుల పంటలు ఇట్లనే ఉన్నయి. నీళ్లలో మునిగిన పత్తి పంటను చూస్తే కండ్లెంబట నీళ్లొస్తున్నయ్. మా బాధ ఎవరికి చెప్పుకోవాలె. సర్కారు వెంటనే సాయం అందించాలి. – లంగరి భూపతి, రైతు, తలాయి.