
- రెండో ప్రపంచ యుద్ధం టైమ్‌లో జపాన్ వికృత ఆట
- ‘కంఫర్ట్ విమెన్’ పేరిట దురాగతాల డాక్యుమెంట్లు బయటికి
టోక్యో: ప్రపంచవ్యాప్తంగా మహిళలపై జరుగుతోన్న లైంగిక అకృత్యాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో యుద్ధకాలంనాటి భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధంలో పాల్గొన్న జపాన్ సైనికుల కోసం అమ్మాయిల్ని బలవంతంగా సెక్స్ బానిసలుగా పంపడం నిజమేనని సీక్రెట్ డాక్యుమెంట్లలో వెల్లడైంది. టోక్యోలోని జపాన్ కేబినెట్ సెక్రటరీ ఆఫీసుకు, చైనాలోని జపాన్ రాయబార కార్యాలయానికి మధ్య 2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు బట్వాడా అయినట్లుగా చెబుతున్న సదరు డాక్యుమెంట్లను ప్రఖ్యాత మీడియా సంస్థ ‘క్యోడో న్యూస్’ ఆదివారం బయటపెట్టింది.
1938లో ఆర్మీ అధికారులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన సంవాదాలన్నీ ఆ డాక్యుమెంట్లలో రికార్డయ్యాయి. సైనికుల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి, వాళ్లతో గడపడానికి అమ్మాయిల్ని పంపాలంటూ ఆర్మీ అధికారులు లెటర్లు రాయడం, ఫలానా తేదీలోగా ఇన్ని వందలమందిని పంపాలని కోరడం చాలా సార్లు రిపీటయ్యాయి. ‘కంఫర్ట్ విమెన్’ లేదా ‘గీషా’గా పిలిచే ఆ పని కోసం ఉమ్మడి కొరియా, తైవాన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పిన్స్ నుంచి అమ్మాయిల్ని రప్పించేవాళ్లు. జపాన్ నుంచి కూడా కొంత మందిని తరలించారు.
ఆర్మీ క్యాంపుల్లో మగ సైనికుల మధ్య రేప్‌లు, అంటురోగాల వ్యాప్తిని నివారించడానకే అధికారులు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మాజీ ఆఫీసర్లు చెబుతున్నారు. మొత్తం 23 డాక్యుమెంట్లలో..13 సీక్రెట్ ఫైళ్లు ఈ వ్యవహారానికి సంబంధించినవేనని క్యోడో న్యూస్ పేర్కొంది. కాగా, ఆర్మీకి సెక్స్ బానిసలుగా వెళ్లిన అమ్మాయిల్లో చాలా మంది.. బెదిరింపులకు భయపడే ఆ పనికి ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది. ‘కంఫర్ట్ విమెన్’ విధానాన్ని యుద్ధసమయంలో మహిళలపై జరిగిన అత్యంత హేయమైన చర్యగా చరిత్రకారులు భావిస్తారు. దీనిపై చాలా కాలంగా వివాదం నడుస్తున్నది. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియా మధ్య గొడవలు పెద్దవైన ప్రతిసారి సెక్స్ బానిసల అంశం తెరపైకి వచ్చేది. ‘‘రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఆర్మీ కోసం అమ్మాయిల్ని బలవంతంగా ‘కంఫర్ట్ విమెన్’గా మార్చిన విషయంపై మేం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాం’’అని 1993లో జపాన్ కేబినెట్ సెక్రటరీ యొహే కొనో ప్రకటన చేశారు.
అప్పట్లో సెక్స్ బానిసలుగా నరకం చూసిన మహిళల్ని గుర్తించి, వాళ్లకు పరిహారం అందించే ప్రయత్నాలు కొన్ని జరిగాయి. అయితే, కంఫర్ట్ విమెన్‌గా వెళ్లిన అమ్మాయిల్లో చాలా మంది అప్పటికే సెక్స్ వర్కర్లుగా ఉన్నవాళ్లని, ఇష్టంతోనే వాళ్లా పనికి ఒప్పుకున్నారని అధికారుల్లోని ఓ వర్గం బలంగా ప్రచారం చేసింది. ఆ తర్వాతి కాలంలో కొరియా, ఫిలిప్పీన్స్ కు చెందిన కొందరు మాజీ ‘కంఫర్ట్ విమెన్’లు.. తమకు జరిగిన అన్యాయాలపై కోర్టులకెక్కినా సరైన న్యాయం దక్కలేదు. వాళ్ల వారసులు ఇప్పటికీ న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ‘కంఫర్ట్ విమెన్’ విధానాన్ని నిరసిస్తూ ఆయా దేశాల్లో స్మారక స్థూపాలు, చిహ్నాలు నిర్మించారు. ఈ మధ్య జపాన్, కొరియాకు మళ్లీ గొడవలు జరుగుతున్న సమయంలోనే సెక్స్ బానిసత్వానికి సంబంధించిన సీక్రెట్ ఫైళ్లు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.