
- ఎమర్జెన్సీ వార్డులో యువతికి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యం
కరీంనగర్, వెలుగు: అనారోగ్యంతో ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన ఓ యువతిపై హాస్పిటల్ టెక్నీషియన్ లైంగిక దాడి చేశారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువతి జ్వరంతో కరీంనగర్ సిటీలోని దీపిక హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అదే హాస్పిటల్‌లో మహారాష్ట్రకు చెందిన దక్షణ్ (24) టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
ఎమర్జెన్సీ వార్డులో నిద్రిస్తున్న యువతికి ఆదివారం తెల్లవారుజామున దక్షణ్ మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేశాడు. స్పృహలోకి వచ్చాక బాధిత యువతి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హాస్పిటల్‌కు చేరుకొని, ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎమర్జెన్సీ వార్డు గదిని సీజ్ చేశారు. అనంతరం సీసీ ఫుటేజీ ఆధారంగా దక్షణ్ లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని విచారిస్తున్నారు. మరోవైపు, నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆస్పత్రిని సీజ్ చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్ డిమాండ్ చేశారు.