గజ్వేల్​లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా?

గజ్వేల్​లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా?
  • ఓటమి భయంతోనే కామారెడ్డి వైపు కేసీఆర్ చూపు  
  • కాంగ్రెస్ ​నుంచి పోటీ చేసేది నేనే 
  • కాంగ్రెస్​ నేత షబ్బీర్​ అలీ

కామారెడ్డి, వెలుగు: గజ్వేల్​లో తన ఓటమిని ముందే గ్రహించి కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు కేసీఆర్​వస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అలీ అన్నారు. కాంగ్రెస్​పార్టీ హాత్​సే హాత్​జోడో, గడపగడపకు కాంగ్రెస్​పార్టీ ప్రోగ్రామ్​లో భాగంగా ఆదివారం కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో జరిగిన మీటింగ్​లో షబ్బీర్​అలీ మాట్లాడారు. గజ్వేల్​లోని  గ్రామాలను నీట ముంచి కామారెడ్డిని ముంచడానికి సీఎం వస్తున్నారని విమర్శించారు. 

గజ్వేల్​లో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే వారు ఈ రోజు భయంతో పారిపోయి వస్తున్నారని ఎద్దేవా చేశారు. గజ్వేల్​లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్​లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు నిలువరించేందుకే కామారెడ్డిలో సీఎం కేసీఆర్​ పోటీ అంశాన్ని తెరపైకి  తీసుకొచ్చారన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ఏ ఊరికి వెళ్లినా ప్రజలు అడ్డుకొని నిలదీసే పరిస్థితి ఉందన్నారు. కామారెడ్డిలో  కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరు పోటీచేసినా కాంగ్రెస్​ నుంచి మాత్రం తానే పోటీ చేస్తానని షబ్బీర్​అలీ స్పష్టం చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్​రావు, పీసీసీ సెక్రెటరీ ఇంద్రకరణ్​రెడ్డి ఉన్నారు.