షబ్బీర్ అలీ సెగ్మెంట్ చేంజ్​!?

షబ్బీర్ అలీ సెగ్మెంట్ చేంజ్​!?

కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీఆర్ అలీ సెగ్మెంట్ మారుతారని తెలుస్తోంది. అందుకే ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు ప్రకటించలేదని సమాచారం. ఇప్పటికే మూడు సార్లు ఓటమి చవి చూసిన షబ్బీఆర్ అలీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే తలంపుతో నియోజకవర్గంలో ఏడాది ముందు నుంచే విస్తృతంగా పర్యటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ కు సవాళ్లు విసిరారు. 

డబుల్ బెడ్రూం ఇండ్ల నాణ్యత చూపించాలంటూ భీష్మించారు. గంపగోవర్ధన్ పై ఉన్న వ్యతిరేకత తనకు కలిసొస్తుందనే ధీమాలో ఉన్న షబ్బీర్ అలీకి ఊహించని షాక్ తగిలింది. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ బరిలోకి దిగనుండటంతోనే ఆయన సెగ్మెంట్ మారేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఎల్లారెడ్డి టికెట్ ఆశిస్తున్న మదన్ మోహన్ రావు కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. మదన్ మోహన్ రావు గత పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్ చేతిలో ఓటమి పాలయ్యారు. 

2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గంపగోవర్ధన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2014, 2018 ఎన్నికలలో గంపగోవర్ధన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. తర్వాత ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కొన్ని రోజులపాటు ఆయన సెగ్మెంట్ కు దూరంగానే ఉన్నారు. 

కామారెడ్డి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న షబ్బీర్ అలీ దాదాపు ఏడాదిగా ఫుల్ యాక్టివ్ అయ్యారు. సెగ్మెంట్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ నేతల ఇండ్లలో శుభ కార్యాలు, పరామర్శలకు వెళ్తున్నారు. కామారెడ్డిలో ఈ సారి సత్తా చాటుతామని ధీమాగా ఉన్న తరుణంలో సీఎం కేసీఆర్ తాను కామారెడ్డి నుంచి బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు. దీంతో కామారెడ్డి సేఫ్ సెగ్మెంట్ కాదనే భావనకు వచ్చిన షబ్బీర్ అలీ ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.