బాబర్ పనికిరాడు.. కెప్టెన్సీకి అతడే సరైనోడు: షాహిద్ అఫ్రిది

బాబర్ పనికిరాడు.. కెప్టెన్సీకి అతడే సరైనోడు: షాహిద్ అఫ్రిది

పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ గా బాబర్‌ ఆజంను నిన్న (మార్చి 31) అధికారికంగా ప్రకటించారు.  సెలక్షన్‌ కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడంతో బాబర్‌ ఆజంను తిరిగి కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపింది. బాబర్ అజామ్ స్థానంలో పాకిస్థాన్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిది కెప్టెన్ గా ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో తనకు తానుగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో మరోసారి బాబర్ ఆజాంకే కెప్టెన్సీని కట్టబెట్టారు.

బాబర్ ను పాక్ కెప్టెన్ గా ప్రకటించడంతో ఆ దేశ మాజీ దిగ్గజం షాహీద్ అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాబర్ అజామ్ ఎంపిక సరైనది కాదు అని ఆయన అన్నాడు. అఫ్రిదీ మాట్లాడుతూ.. బాబర్ కు మరోసారి పాక్ పగ్గాలు అప్పగించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పాకిస్థాన్‌కు నాయకత్వం వహించేందుకు బాబర్ కంటే వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ సరైన ఎంపిక". అని అఫ్రిది వాదించాడు.  

భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో పాక్ పేలవ ప్రదర్శన చేసింది. దీంతో పాక్‌ క్రికెట్‌లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విదేశీ కోచ్‌లను తప్పించడంతో పాటు కెప్టెన్సీ నుంచి బాబర్‌ ఆజంను తప్పుకోవాలని సూచించి.. అతని స్థానంలో షహీన్ అఫ్రిదిని పరిమిత ఓవర్ల కెప్టెన్ గా ఎంపిక చేశారు. అయితే షాహిన్‌ అఫ్రిది నాయకత్వంలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన పాక్.. టీ20 సిరీస్‌లోను 4-1తో కోల్పోయింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు మరోసారి బాబర్ అజామ్ నే నమ్ముకుని అతనికి కెప్టెన్సీ అప్పగించారు. 

టెస్టులకు షాన్‌ మసూద్‌నే సారథిగా కొనసాగించనున్నారు. ఏప్రిల్‌ 18 నుంచి స్వదేశంలో పాకిస్తాన్‌ జట్టు.. న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌తో బాబర్‌ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.