ICC World Cup 2023: అందుకు పాక్ పగ తీర్చుకోవాలి: షాహిద్ అఫ్రిది

ICC World Cup 2023: అందుకు పాక్ పగ తీర్చుకోవాలి: షాహిద్ అఫ్రిది

వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదలై 20 రోజులు కావొస్తున్నా.. ఈ టోర్నీలో పాక్ పాల్గొంటుందా! లేదా! అన్న దానిపై సందేహాలు వీడటం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇండియా- పాక్ మ్యాచ్ పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఆసియా కప్ 2023 వివాదానికి వరల్డ్ కప్ 2023 రూపంలో ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ యోచిస్తోంది. మెగా టోర్నీని బహిష్కరిస్తే.. బీసీసీఐ తమ దారికి వస్తుందన్న ఆశతో శాయశక్తులా ప్రయత్నిస్తోంది.

అయితే ఆ దేశ క్రికెట్ బోర్డు వైఖరిని ఆ జట్టు మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది వ్యతికరేకించారు. వరల్డ్ కప్ టోర్నీని బహిష్కరించాలన్నా.. నిర్ణయాన్ని అఫ్రిదీ తప్పుబట్టారు. ఇలాంటి సమయంలోనే శక్తికి మించి రాణించాలని, అప్పుడే ప్రపంచ దేశాలకు తమ సత్తా ఏంటో చూపించగలమంటూ ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు.
 
'ప్రపంచకప్‌ బహిష్కరణకు నేను వ్యతిరేకం. ప్రపంచ కప్‌ టోర్నీలో పాక్ ఆడాలి.. విజయం సాధించాలి. అప్పుడే మనమెంతో అందరికీ తెలిసొస్తుంది. అక్కడ ఆడటం సవాలుతో కూడుకున్నదని నాకు తెలుసు. మేము పొరుగు దేశానికి(ఇండియా) వెళ్లినప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. బెంగుళూరు టెస్టులో భారత్‌ను ఓడించిన తర్వాత మా బస్సుపై రాళ్ల దాడి జరిగింది. కానీ అలాంటి వాటికి భయపడకూడదు.." అని అఫ్రిదీ చెప్పుకొచ్చారు.