
వాషింగ్టన్: ఆమె అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్.. ఈయన యూఎస్ ప్రెసిడెంట్. ఆమె డెమోక్రాట్.. ఈయన రిపబ్లికన్. సహజంగానే ఒకరంటే ఒకరికి పడదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ‘ఇంపీచ్మెంట్’ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి వీరిద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. వీలు చిక్కినప్పుడల్లా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ సారి వీరి వైరానికి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వేదికగా మారింది. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. నోటికి ఎంత అంటే అంత మాట్లాడే డొనాల్డ్ ట్రంప్ ఒకరైతే.. ఆయన్ను గద్దె దించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న నాన్సీ పెలోసీ మరొకరు. మంగళవారం (అమెరికా టైం ప్రకారం) వాళ్లిద్దరు చేసిన పనులు.. సభలో ఉన్న మెంబర్లనే కాదు.. అమెరికాను, మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేశాయి.
అసలేం జరిగింది…?
హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సమావేశం జరుగుతోంది.. డెమోక్రాట్లు, రిపబ్లికన్లతో హాల్ నిండిపోయింది. సెనేట్, హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ను ఉద్దేశించి మాట్లాడేందుకు ట్రంప్ లోపలికి వచ్చారు. యాన్యువల్ స్పీచ్ కాపీలను స్పీకర్ నాన్సీ పెలోసీకి ఇచ్చారు. కానీ షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ఆమె చేయి చాచితే.. ట్రంప్ పట్టించుకోకుండా వెనక్కి తిరిగారు. చేయి కలపకుండా వెళ్లిపోయారు. దీంతో పెలోసీ వెనక్కి తగ్గి, సీటులో కూర్చున్నారు. ట్రంప్ ప్రసంగం చదవడం ప్రారంభించారు. ఆయన చదువుతున్నంత సేపు రిపబ్లికన్ నేతలు చప్పట్లతో మద్దతు తెలిపారు. డెమోక్రాట్లు మాత్రం జరుగుతున్న తతంగాన్ని చూస్తూ ఉన్నారు. ట్రంప్ ప్రసంగం పూర్తయింది. రిపబ్లికన్లు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. డెమోక్రాట్లు సీటు వదిలిపెట్టకుండా అట్లనే కూర్చున్నారు. ఇంతలో ‘పరా పరా’ అని శబ్దం. ట్రంప్ ఇచ్చిన పేపర్లను శ్రద్ధగా జమ చేసి.. ఒక వరుసలో పెట్టుకుని చించుతున్నారు పెలోసీ. అన్నీ ఒకేసారి చింపకుండా.. కొన్ని కొన్ని తీసుకుని నాలుగు సార్లు చించారు. చించిన పేపర్లను అలా టేబుల్ ముందు పడేశారు. తర్వాత చేతులు దులుపుకున్నారు. ఆమె పక్కనే ఉన్న యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ నవ్వుతూనే ఓరకంటితో చూశారు. ఒకపక్క ట్రంప్ ప్రసంగానికి చప్పట్లతో మద్దతు తెలుపుతూనే అంతా గమనించారు.
అదే మర్యాద: నాన్సీ పెలోసీ
ట్రంప్ ప్రసంగం తర్వాత పేపర్లను ఎందుకు చించారని పెలోసీని మీడియా ప్రశ్నించింది. ఆమె బదులిస్తూ.. ‘‘ఎందుకంటే అదే మర్యాద’’ అన్నారు. ఆల్టర్నేటివ్స్ను పరిగణనలోకి తీసుకుంటే.. తాను చేసిందే మర్యాదపూర్వకమైన పని అని చెప్పారు.
ఇంపీచ్‌మెంట్‌పై సెనేట్‌లో ఓటింగ్!
ట్రంప్ ఇంపీచ్‌మెంట్‌పై బుధవారం సాయంత్రం 4 గంటలకు (అక్కడి టైం ప్రకారం) సెనేట్‌లో ఓటింగ్ జరగనుంది. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తన రాజకీయ లబ్ధి కోసం ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలతో డెమోక్రాట్లు ఆయనపై ఇంపీచ్‌మెంట్‌కు ప్రతిపాదించారు. ట్రంప్‌ను ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించి, ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొన్నాళ్ల కిందట ఓటింగ్ జరగ్గా హౌస్ఆఫ్రిప్రజెంటేటివ్స్ లో ఇంపీచ్మెంట్ కు అనుకూలంగా ఓట్లు పడ్డాయి. డెమోక్రాట్ల మెజారిటీ ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. కానీ సెనేట్‌లో ఇంపీచ్మెంట్ తీర్మానం పాస్ కావడం అంత తేలికకాదు. వంద మంది సభ్యులు ఉన్న సెనేట్‌లో రిపబ్లికన్ల సంఖ్యే ఎక్కువ. తీర్మానం పాస్ కావాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. దీంతో ట్రంప్ ఈజీగా గట్టెక్కుతారని ఎక్స్పర్టులు చెబుతున్నారు.