
రామ మందిర నిర్మాణానికి నేపాల్ ప్రభుత్వం అందజేసిన రెండు సాలగ్రామ శిలలు భారీ వాహనంలో అయోధ్యకు చేరుకున్నాయి. దీంతో పూజారులు, స్థానికులు వాటికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం వాటిని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు. దీంతో అయోధ్య మొత్తం జై శ్రీరామ్ అనే నామస్మరణతో మారుమ్రోగింది. నేపాల్‌లోని జనక్‌పూర్ నుండి హెవీ డ్యూటీ ట్రక్కుల ద్వారా వీటిని అయోధ్యకు తరలించారు.
ఇందులో ఒకటి 18 టన్నులు మరొకటి 16 టన్నుల బరువు ఉంది. నేపాల్‌లోని గండకీ నది సమీపంలో లభించే ఈ శిలలను విష్ణు భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. 60 మిలియన్ల వయసున్న ఈ శిలలతోనే రాముడు, సీత,లక్ష్మణ, అంజనేయ విగ్రహాలను తయారుచేయనున్నారు. 2024 జనవరి నాటికి రాముడి దర్శనం కల్పిస్తామని కేంద్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.