గృహ హింస కేసు: మహమ్మద్ షమీపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

గృహ హింస కేసు: మహమ్మద్ షమీపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

భారత బౌలర్ మహమ్మద్ షమీపై నమోదైన గృహ హింస కేసు విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల వ్యవధిలోపు ఈ కేసుపై నిర్ణయం తీసుకోవాలని పశ్చిమ్‌ బంగా సెషన్స్‌ కోర్టుకు స్పష్టంచేసింది. చీఫ్‌ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుంప్రీకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. 

అదనపు కట్నం కోసం తనను వేధించారంటూ షమీ భార్య హసీన్ జహాన్ 2018లో అతనితో పాటు మరికొందరు కుటుంబసభ్యులపై పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ కాగా, ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ షమీ సెషన్స్ కోర్టుకెక్కారు. విచారించిన సెషన్స్‌ న్యాయమూర్తి.. అరెస్టు వారెంట్‌ను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు. అనంతరం ఈ వివాదం మరోసారి కోర్టు పరిధికి రాగా, సెషన్స్‌ న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ కోల్‌కతా హైకోర్టు 2023, మార్చి 29న ఆదేశాలిచ్చింది. 

ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అతని సతీమణి హసీన్ జహాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం షమీపై నమోదైన కేసులో క్రిమినల్‌ రివిజన్‌ చేపట్టాలని ఆదేశించింది. నెల రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలని పశ్చిమ్‌ బంగా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తిని ఆదేశించింది. 

ALSO READ: MS Dhoni Birthday: ధోని జీవితంలో విషాద గాథ

షమీ స్త్రీలోలుడు: హసీన్ జహాన్

షమీకి అక్రమ సంబంధాలు ఉన్నాయన్నది హసీన్ జహాన్ ఆరోపణ. గత కొన్నేళ్లుగా షమీకి దూరంగా ఉంటున్న హసీన్ జహాన్ అవకాశం దొరికినప్పుడల్లా అతనిపై ఆరోపణలు చేస్తూ వస్తోంది. షమీ స్త్రీలోలుడని.. చివరకు పడుపు వృత్తితో బతికే వేశ్యలతోనూ అతనికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. అంతేకాదు వయసు విషయంలో షమీ.. బీసీసీఐకి తప్పుడు ధృవ పత్రాలు సమర్పించారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అయితే వీటిని బీసీసీఐ కొట్టిపడేసింది. అతనిపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు కావంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. 
 
 ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న షమీ.. ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 కోసం సన్నద్దమవుతున్నాడు.