పోరు తెలంగాణ : తొలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్​

పోరు తెలంగాణ : తొలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్​

ఆదిలాబాద్​ అడవుల నుంచి.. ఖమ్మం గుమ్మం దాకా..! పాలమూరు పల్లెల నుంచి.. మెతుకుసీమ గడపల దాకా..! ఓరుగల్లు కోటల నుంచి.. హైదరాబాద్​ గల్లీల దాకా..! ఇందూరు, కరీంనగర్​, నల్లగొండ, రంగారెడ్డి.. ఊరూవాడా.. కలబడి నిలబడితే వచ్చిందీ తెలంగాణ. ఇది పోరాటాల ఖార్ఖానా. ఒక్కరా.. ఇద్దరా.. వందలు వేలమంది చావును ముద్దాడుతూ.. వదిలిన ఊపిరే ఈ తెలంగాణ. ఇది త్యాగాల వీణ!! ‘మా కొలువులు మాగ్గావాలె’ అనే నినాదంతో మొదలైన ఉద్యమం.. ఉవ్వెత్తున ఎగిసింది. స్వరాష్ట్ర కాంక్షను రగిలించింది. ఆరు దశాబ్దాలకుపైగా అలుపెరగని పోరాటాలతో 2014 జూన్​ 2న రాష్ట్రం సిద్ధించింది. ఈ పోరు వెనుక ఎన్నో కీలక ఘట్టాలు.. మరెన్నో మైలు రాళ్లు. వాటిని ఒక్కసారి యాదికి తెచ్చుకుందాం...
 

తొలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్​

 • 1969 జనవరి 5: తెలంగాణ ఉద్యమానికి మరో బీజం పడింది ఇక్కడే. పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలోకి తొక్కి తెలంగాణలో ఆంధ్రోళ్లకే ఎక్కువ ఉద్యోగాలిస్తుండడంతో ఉద్యమం మొదలైంది. పాల్వంచలోని థర్మల్​ పవర్​ ప్లాంట్​లో ఆంధ్రోళ్లకే ఎక్కువ ఉద్యోగాలిచ్చారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగుల నిరసన. 
 • 1969 జనవరి 9: తాను ముల్కీ అయినప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదంటూ బీఏ స్టూడెంట్​, నేషనల్​ స్టూడెంట్స్​ యూనియన్​ నాయకుడు రవీంద్రనాథ్​.. గాంధీచౌక్​ దగ్గర దీక్ష చేశారు. ఆయనతోపాటు ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు, కవి శ్రీర కవి రాజమూర్తి కూడా పాల్గొన్నారు. వివిధ డిమాండ్లతో తెలంగాణ రక్షణ సమితి ఏర్పాటు. 
 • 1969 జనవరి 10: నిజామాబాద్​, ఉస్మానియా యూనివర్సిటీకి పాకిన నిరసనలు. 
 • 1969 జనవరి 13: ఓయూలో ‘తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి’ ఏర్పాటు. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా విద్యార్థుల తీర్మానం. అదే రోజు పలువురు ప్రముఖులు కలిసి ‘తెలంగాణ పరిరక్షణ కమిటీ’ని ఏర్పాటు చేశారు. 
 • 1969 జనవరి 20: శంషాబాద్​లో స్కూలు విద్యార్థులపై కాల్పులు. 
 • 1969 జనవరి 24: ఉద్యమంలో భాగంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై సదాశివపేటలో పోలీసుల కాల్పులు. కాల్పుల్లో 14 మందికి గాయాలు. ట్రీట్​మెంట్​ తీసుకుంటూ ఆ తెల్లారే ఒకరి మృతి. శంకర్​ అనే 17 ఏండ్ల విద్యార్థి చనిపోయారు. ఆయనే తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు. 
 • 1969 ఫిబ్రవరి 28: యువకులు, మేధావులు కలిసి హైదరాబాద్​లో తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేశారు. 
 • 1969 మార్చి 29:  నాన్​ ముల్కీలను పంపించేయడం సరికాదని సుప్రీంకోర్టు తీర్పు. స్థానికేతరులను పంపించే ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధింపు. ఆ వెంటనే సుప్రీం కోర్టు తీర్పును ఖండిస్తూ కొండా లక్ష్మణ్​ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్​ సమితిని ఏర్పాటు చేసి.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బాటలు వేశారు. 
 • 1969 ఏప్రిల్​ 12: ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆపేందుకు 8 పాయింట్​ ఫార్ములాను ప్రతిపాదించిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ
 • 1969 జూన్​: ప్రత్యేక తెలంగాణ కోసం సమ్మెలు, బంద్​లతో ఈ నెలంతా మార్మోగిపోయింది. 
 • 1969 జూన్​ 10: తెలంగాణ ప్రాంత ఉద్యోగులంతా సమ్మెను షురూ చేశారు. 
 • 1969 జూన్​ 24: అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఉమ్మడి ఏపీకి వచ్చారు. అందరితో ఆమె చర్చలు జరిపినా విఫలమయ్యాయి. 
 • 1969 జూన్​ 25: హైదరాబాద్​లో ఉద్యోగుల సమ్మె.
 • 1969 జూన్​ 27: అప్పటి సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి రాజీనామా.
 • 1969 ఆగస్టు 18: లోక్​సభలో తెలంగాణ ప్రాంత ఎంపీలు కాకా జి. వెంకటస్వామి, జి.ఎస్. మేల్కోటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర గళం వినిపించారు. 
 • 1969 సెప్టెంబర్​ 25: టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్రపతిని కలిసిన కొండా లక్ష్మణ్​ బాపూజీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ కోరారు. 
 • 1969 నవంబర్​ 26: ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్టు మర్రి చెన్నారెడ్డి ప్రకటన. 
 • 1970 డిసెంబర్​ 10: ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవేనంటూ ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పు.
 • 1973 సెప్టెంబర్​ 21: తెలంగాణ, ఏపీ ప్రాంతాల నేతల మధ్య ఆరు పాయింట్ల ఫార్ములాపై ఒప్పందం. 
 • 1985 డిసెంబర్​ 30: జోన్ల వారీగా ఉద్యోగులను కేటాయించేందుకు జీవో 610 విడుదల