
బాగా చదువుకుని ఐఏఎస్ అవుతాడు అనుకున్నారంతా. కానీ.. శంకర్ మాత్రం చదువు మానేసి మష్రూమ్ పండిస్తానన్నాడు. ఎంతమంది వద్దన్నా వినకుండా చిన్నగదిలో సాగు ప్రయాణం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా అప్పుచేసి మరీ భారతదేంలోనే మొట్టమొదటి కమర్షియల్ మష్రూమ్ స్పాన్ ల్యాబ్‌ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దానిద్వారా నెలకు 80 టన్నుల స్పాన్ ప్రొడ్యూస్ చేస్తూ.. లక్షల్లో సంపాదిస్తున్నాడు. మష్రూమ్ పండించాలి అనుకునే రైతులకు స్పాన్ సప్లై చేయడంతో పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి సాయం చేస్తున్నాడు.
రాజస్థాన్‌లోని ఒక చిన్న పల్లెటూరిలో పుట్టాడు శంకర్ మీనా. వాళ్లది వ్యవసాయ కుటుంబం కావడంతో పంట పొలాల మధ్య ఆడుతూ పెరిగాడు. సాగు చేయడానికి తన తండ్రి రాత్రింబవళ్లు కష్టపడటం చూశాడు. అతను పెద్దయ్యాక అనూహ్య వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడి బాగా తగ్గిపోవడం, ఫలితంగా రైతుల ఆదాయాలు తగ్గడం గమనించాడు. అందుకే రైతులకు స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గాలపై రీసెర్చ్ మొదలుపెట్టాడు. అప్పుడే కామర్స్‌లో అతని గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది. ఆ తర్వాత ఎంబీఏ (ఫైనాన్స్)లో చేరాడు. అయితే, 2012లో తన మొదటి సెమిస్టర్ పూర్తైన వెంటనే చదువు మానేశాడు. ‘‘నేను ఎంబీఏలో చేరుతున్నప్పుడే నా మనసులో బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండేది. వ్యవసాయం, బిజినెస్‌లను కలిపి చేయగలిగే మార్గాన్ని అన్వేషించడం మొదలుపెట్టా. నాకు మష్రూమ్ ఐడియా రాగానే చదువు మానేశా” అని చెప్పుకొచ్చాడు శంకర్.
స్పాన్ యూనిట్
శంకర్ మష్రూమ్స్‌ని పెంచడం మొదలుపెట్టాక అతనికి రాజస్థాన్‌లో పుట్టగొడుగుల స్పాన్ (విత్తనాలు) ను తయారు చేసే యూనిట్ ఒక్కటికూడా లేదని తెలిసింది. చాలామంది హిమాచల్, హర్యానా, ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అందుకే అదే సరైన అవకాశంగా భావించి స్పాన్ తయారుచేసే యూనిట్ పెట్టాడు. అందుకోసం శంకర్ ఐసీఏఆర్ నుంచి మదర్ కల్చర్‌ని తీసుకున్నాడు. ఆ తర్వాత తన ఇంటి గ్యారేజీలోనే తాత్కాలికంగా ఒక చిన్న ల్యాబ్‌ని ఏర్పాటు చేసి, ప్రయోగాత్మకంగా స్పాన్‌లను పెంచాడు. అదే టైంలో ప్రధానమంత్రి ముద్ర యోజన కింద రూ. 9 లక్షల లోన్ వచ్చింది. దాంతోపాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ డబ్బు సాయం చేయడంతో 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో ఒక ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశాడు. ఉత్పాదకత పెంచేందుకు సీడ్ జెర్మినేషన్ చాంబర్స్, వర్టికల్ ఆటో క్లేవ్స్, ల్యామినార్ ఎయిర్‌ఫ్లో క్యాబినెట్ లాంటి అధునాతన మెషీన్లను కొన్నాడు.
జీవన్ మష్రూమ్
స్పాన్‌ని తయారుచేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాక తన భార్య కంచన్ మీనాతో కలిసి 2017లో ‘జీవన్ మష్రూమ్’ పేరుతో ఒక కంపెనీ పెట్టాడు శంకర్. అందులో ప్రస్తుతం బటన్, ఆయిస్టర్, లయన్స్ మెన్, ప్యాడీ స్ట్రా, షిటేక్, గనోడెర్మా, పోర్టోబెల్లోతోపాటు మరికొన్ని రకాల మష్రూమ్ స్పాన్‌లను తయారుచేస్తున్నాడు. వాటిని సోషల్ మీడియా ద్వారా అమ్ముతున్నాడు. శంకర్ ప్రస్తుతం నెలకు 80 టన్నుల స్పాన్‌ని ఉత్పత్తి చేస్తున్నాడు. కిలోకు రూ. 90–115 మధ్య అమ్ముతున్నాడు. ఈ స్పాన్‌కు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో భారీగా డిమాండ్ ఉంది. కొన్నాళ్ల క్రితం విదేశాల్లో కూడా అమ్మకాలు మొదలుపెట్టాడు. ముఖ్యంగా భూటాన్, నేపాల్, యూఏఈ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. ప్రస్తుతం స్పాన్ అమ్మకాల ద్వారా శంకర్ నెలకు రూ. 13 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు.
►ALSO READ | ట్రైనింగ్ ఇస్తే.. 25 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగం ఊడగొట్టింది!
నష్టాలు కూడా..
శంకర్ ఇప్పుడు లాభాలు పొందుతున్నప్పటికీ కొన్నిసార్లు చాలా నష్టాలు చూశాడు. పోయినేడు తక్కువ దిగుబడి వస్తోందని కంప్లైంట్లు వచ్చాయి. దాంతో స్పాన్ తయారీలో వాడే ప్రతి మెషీన్‌ని చెక్ చేశారు. అప్పుడు మెషీన్‌లో సన్నని వెంట్రుకల పరిమాణంలో లీకేజీ ఉందని, అది స్పాన్‌లను కలుషితం చేస్తోందని తెలిసింది. దానివల్ల దాదాపు రూ. 27 లక్షల వరకు నష్టం వచ్చింది. “ఇలాంటప్పుడు బిజినెస్ మానేయాలి అనిపిస్తుంటుంది. కానీ.. ఒక్కసారి వెనక్కి తిరిగి నా ప్రయాణాన్ని చూసుకుంటే.. ఇంత దూరం వచ్చింది ఇలా మధ్యలో ఆపడానికా? అని నాకు నేనే సర్దిచెప్పుకుంటా. అసలు ఏమాత్రం అనుభవం లేకుండా బిజినెస్ మొదలుపెట్టా. నా జీవితంలో అసలు టెస్ట్ ల్యాబ్‌ను చూసిందే లేదు. నా ట్రైనింగ్ టైంలోనే మొదటిసారి చూశా. అయినా ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకుని ఏర్పాటు చేశా. ఈ చిన్న చిన్న విజయాలే నాకు ఎంతో ప్రేరణ ఇస్తాయి. అందుకే ఎప్పుడూ ప్లాన్–బి గురించి ఆలోచించకుండా కష్టపడి ముందుకు సాగుతున్నా” అన్నాడు శంకర్. అతను 2019లో రాజస్థాన్ ప్రభుత్వం నుంచి ప్రోగ్రెసివ్ అండ్ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు, 2020లో స్టార్టప్ ఇండియా నుంచి ఇన్నోవేటివ్ అగ్రికల్చరల్ స్టార్టప్ అవార్డు కూడా అందుకున్నాడు.
ఎన్నో చిక్కులు
చదువు మానేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు అతని కుటుంబంతో సహా అందరూ శంకర్‌ని వ్యతిరేకించారు. ‘‘బిజినెస్ చేస్తానంటే కొందరు ‘నువ్వు చేయలేవ్’ నా ముఖం మీదే చెప్పేశారు. ఈ వయసులో వ్యాపారం చేయడం కంటే బాగా చదువుకుని కెరీర్‌ను బిల్డ్ చేసుకోవాలని సలహాలు ఇచ్చారు. అయినా నేను అవేవీ పట్టించుకోలేదు. మష్రూమ్ పెంపకం అనేది అప్పట్లో కొత్త. చాలా తక్కువమంది చేసేవాళ్లు. హోటళ్లలో తప్ప ఇంట్లో వండుకుని తినేవాళ్లు చాలా తక్కువ. కానీ.. భవిష్యత్తులో వీటి వినియోగం బాగా పెరుగుతుందని ముందుగానే అంచనా వేశా. అయితే.. పుట్టగొడుగుల పెంపకంలో చాలా చిక్కులు ఉంటాయని నాకు తెలుసు. అందుకే దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కొన్ని సంస్థల్లో ట్రైనింగ్ తీసుకున్నా” అని చెప్పాడు శంకర్. అతను 2015లో పుట్టగొడుగుల సాగులోని ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి సోలన్‌లోని ఐసీఏఆర్ -డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్‌కి వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తన ఇంట్లోని ఒక చిన్న గదిని ఖాళీ చేయించి అందులో సాగు మొదలుపెట్టాడు.
తక్కువ ధరకు ఎక్కువ క్వాలిటీ
‘‘ఈ రంగంలో సక్సెస్ కావడానికి ముఖ్య కారణం నేను తయారుచేసే స్పాన్‌ల క్వాలిటీ. ఎక్కడా రాజీ పడకుండా తక్కువ ధరకే హై క్వాలిటీ స్పాన్‌ని అందిస్తున్నా. కూరగాయలు, ఇతర పంటల్లాగా పుట్టగొడుగులకు విత్తనాలు ఉండవు. అది ల్యాబ్‌లో పరిశుభ్రమైన వాతావరణంలో డెవలప్ చేసే ఒక రకమైన ఫంగస్. దాంతో మరిన్ని స్పాన్‌లను తయారుచేయడానికి టిష్యూ కల్చర్, మదర్ స్పాన్ అవసరం ఉంటుంది. కానీ.. కొందరు రైతులు ఈ పద్ధతిలో కాకుండా షార్ట్‌కట్‌లో వీటిని తయారుచేస్తుంటారు. మదర్ స్పాన్‌కు బదులు కమర్షియల్ స్పాన్‌లను ఉపయోగించి మరిన్ని స్పాన్‌లను తయారుచేస్తుంటారు. దాంతో క్వాలిటీ చాలా తగ్గుతుంది. అందువల్ల మష్రూమ్ రకరకాల వ్యాధులకు గురవుతుంది. దిగుబడి తగ్గిపోతుంది” అని చెప్పుకొచ్చాడు శంకర్.