
నాగర్‌కర్నూల్, వెలుగు: నాగర్కర్నూల్జడ్పీ చైర్మన్ఎన్నికలో హైడ్రామా చోటుచేసుకుంది. ఎంపీ రాములు కొడుకు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్‌ప్రసాద్ ఈసారి జడ్పీ చైర్మన్‌గా ఎన్నికవుతారని అంతా భావించారు. కానీ రాత్రికి రాత్రే ఇద్దరు ఎమ్మెల్యేలు చక్రం తిప్పడంతో ఊర్కొండ జడ్పీటీసీ సభ్యురాలు శాంతకుమారి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్పీ చైర్మన్ ఎంపిక కోసం గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లెక్చర్ హాల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 16 మంది, ముగ్గురు కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. తిమ్మాజీపేట జడ్పీటీసీ సభ్యుడు దయాకర్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ పదవికి ఊర్కొండ జడ్పీటీసీ సభ్యురాలు శాంతకుమారి పేరును ప్రతిపాదించగా పెద్దకొత్తపల్లి జడ్పీటీసీ సభ్యురాలు గౌరమ్మ బలపరిచారు. మరో పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో శాంతకుమారి జిల్లా పరిషత్ కొత్త చైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్ ప్రకటించారు.
చివరి నిమిషం వరకు సస్పెన్స్
పదవి తమకే దక్కుతుందనే ఉద్దేశంతో చైర్మన్ఎన్నిక, ప్రమాణ స్వీకారానికి అందరూ రావాలని ఎంపీ రాములు, జడ్పీటీసీ భరత్ అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్కర్నూల్ప్రాంతాలకు చెందిన పార్టీ ముఖ్య లీడర్లను ఆహ్వానించారు. ఉదయం 8 గంటలకు కల్వకుర్తి నుంచి ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జడ్పీటీసి భరత్ తదితరులు నాగర్‌కర్నూల్ వెళ్లారు. మెడికల్ కాలేజీకి చేరుకున్న తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీల సమక్షంలో ప్రగతిభవన్ నుంచి వచ్చిన సీల్డ్ కవర్విప్పారు. అందులో ఊర్కోండ జడ్పీటీసీ శాంతకుమారి పేరు ఉండటంతో అంతా కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించే లెక్చర్ హాల్లోకి వెళ్లారు. మధ్యలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో తాను ఏం చేశానని ఎంపీ రాములు అడగటం కనిపించింది. బుధవారం రాత్రి ప్రగతిభవన్‌కు వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో భరత్‌కు జడ్పీ చైర్మన్ ఇవ్వద్దని పట్టుబట్టినట్లు సమాచారం. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ప్రగతిభవన్‌కు పిలిపించి ఆయన నియోజకవర్గానికి చెందిన ఊర్కోండ జడ్పీటీసీకి చైర్మన్ పదవి ఇస్తున్నట్లు సమాచారం ఇచ్చారు.
విస్తృతంగా తిరుగుతా: భరత్
నేను చైర్మన్ రేసులో ఉన్నా. 2019లోను రేస్‌లో ఉన్నానని భరత్ అన్నారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చే విద్యావంతులను దూరంగా ఉంచాలని కొంతమంది అనుకుంటున్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో తనను చట్టసభలకు పంపించడం కోసం ఇప్పుడు అవకాశం ఇవ్వలేదేమో అనుకుంటున్నానని చెప్పారు. తాను ఇతర ప్రాంతాల్లో తిరగడానికి జడ్పీటీసీ పదవి అడ్డమైతే వదిలేసుకుంటానన్నారు. ఇకపై విస్తృతంగా తిరుగుతానని చెప్పారు. జడ్పీటీసీ భరత్ తన రాజీనామాను ఇవ్వడానికి వెళ్లిన టైంలో కలెక్టర్ లేకపోవడంతో టేబుల్‌పై ఉంచి తిరిగొచ్చారు. రెండు రోజుల్లో కలెక్టర్‌ను కలిసి ఆయన చేతికి ఇవ్వనున్నట్లు తెలిపారు. తన కొడుకు భరత్‌కు రెండోసారి కూడా జడ్పీ చైర్మన్ పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన ఎంపీ రాములు ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. పార్టీ హై కమాండ్ నిర్ణయమే ఫైనల్ అని, కాలమే అన్నీ నిర్ణయిస్తుందన్నారు. జడ్పీ చైర్పర్సన్ ఎన్నిక అనంతరం జడ్పీటీసీలు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి అచ్చంపేట ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజు ప్రెస్‌తో మాట్లాడారు. బీఆర్ఎస్గా మారిన తర్వాత జిల్లాలో ఇది తమ తొలి విజయమన్నారు. హైకమాండ్ నిర్ణయం మేరకే జడ్పీ చైర్ పర్సన్ ఎన్నిక జరిగిందన్నారు.