శరద్ పవార్ చాణక్యం...ఒకే దెబ్బకు మూడు పిట్టలు

శరద్ పవార్ చాణక్యం...ఒకే దెబ్బకు మూడు పిట్టలు

శరద్ పవార్ మొత్తానికి మొనగాడిననిపించుకున్నారు. ఈ రాజకీయ దురంధరుడు ఒకే దెబ్బకు రెండు కాదు ఏకంగా మూడు పిట్టల్ని కొట్టడం ద్వారా తానేమిటో చాటుకున్నారు. జాతీయతావాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తన ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని అంతటినీ రంగరించి అసమ్మతి అలల అలజడిలో చిక్కుకున్న ఎన్సీపీ నావకు లంగరు వేయగలిగారు. ఈ క్రమంలో ఆయన మూడు ప్రయోజనాలు సాధించారు. 

అజీత్ అసమ్మతి

శరద్ కు ఆయన మేనల్లుడు అజీత్ పవార్ నుంచే సవాల్ ఎదురైంది. శివసేనకు చెందిన ఏక్ నాథ్ శిండే తిరుగుబాటుతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన ఉద్ధవ్ థాకరే అందుకు ఎంత బాధపడ్డారో తెలియదుకానీ, ఉప ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన అజీత్ పవార్ మాత్రం చాలా అశాంతికి లోనయ్యారు. అయితే, అసలు ఉద్ధవ్ థాకరే పదవికి ఎసరు రావడానికి పరోక్షంగా అజీతే కారణం.  ముఖ్యమంత్రి ఉద్ధవ్ వ్యవహారశైలికి భిన్నంగా చురుకుదనం మూర్తీభవించిన అజీత్ ఉదయం నుంచే ఎమ్మెల్యేలు, మంత్రులకు అందుబాటులో ఉండడం సాగించారు. దాంతో శివసేన ఎమ్మెల్యేలు కూడా పనుల కోసం ఉద్ధవ్ బదులు అజీత్ ను ఆశ్రయించవలసి వచ్చేది. 

ఇది సహజంగానే శివసేన ఎమ్మల్యేలకు మింగుడుపడలేదు. ఏక్ నాథ్ శిండే నేతృత్వంలో వారిలో కొందరు గుట్టుచప్పుడు కాకుండా తిరుగుబాటు చేసి మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కూడిన మహా వికాస్ ఆఘాడీ (ఎం.వి.ఏ) ప్రభుత్వం పతనమయ్యేటట్లు చేశారు. శిండే నేతృత్వంలో చీలిపోయిన శివసేన వర్గం భారతీయ జనతా పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలో రేకెత్తిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం ఇప్పటికీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ పరిశీలనలో ఉంది. కాగా, కొంతమంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతుతో అజీత్ ఆమధ్య బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు మంతనాలు సాగించారు. ప్రఫుల్ పటేల్ తో కలసి ఆయన ఢిల్లీ వెళ్ళిన విషయం పత్రికలకు పొక్కడంతో కలకలం రేగింది. 

శరద్ మౌన ముద్ర

అజీత్ అసలు సంగతిని నేరుగా శరద్ కే నివేదించారని వినికిడి. అధికారం కోసం పార్టీని వీడి కొందరైనా అజీత్ వెంట నడుస్తారని తెలిసిన శరద్ మొదట్లో మౌనం వహించారు.  జీవిత చరమాంకంలో బీజేపీలో చేరలేనని అజీత్ కు చెప్పేశారు. రిటైర్మెంట్ మూడ్ లో ఉన్న శరద్ నుంచి తనకు సగం ఆమోద ముద్ర లభించినట్లేనని అజీత్ భావించారు. అక్కడే ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. 

పార్టీకి కొత్త రూపురేఖలు

ఈ సందర్భంగా పార్టీకి కొత్త రూపురేఖలనిచ్చే అవకాశాన్ని చేజిక్కించుకోవడం శరద్ సాధించిన మూడవ ప్రయోజనం. ఒకప్పుడు రైతుల నుంచి తిరుగులేని విశ్వాసాన్ని చూరగొన్న ఎన్సీపీకి ఇంచుమించుగా రెండు దశాబ్దాల నుంచి పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే మహారాష్ట్రలో కూడా రైతుల కుటుంబాలలో కొందరు సభ్యులైనా పట్టణాలు, నగరాలకు వలస వస్తున్నారు. ఇతర వృత్తి వ్యాసంగాలు చేపడుతున్నారు. ఫలితంగా, వారి ఓటింగ్ సరళిలో మార్పు వచ్చింది. మరాఠాల ఓట్లు ప్రధానంగా నాలుగు (శివసేన, ఎన్సీపీ, బీజేపీ, కాంగ్రెస్) పార్టీల మధ్య చీలుతున్నాయి. పశ్చిమ మహారాష్ట్ర ఒకప్పుడు ఎన్సీపీకి పెట్టనికోటగా ఉండేది. అటువంటి పశ్చిమ మహారాష్ట్రలో కూడా మరాఠాలు క్రమంగా బీజేపీ వైపు మరలుతున్నారు. దాంతో దళితులు, గిరిజనులు, ముస్లింలను అక్కున చేర్చుకునే పార్టీగా ఎన్సీపీ ని మలచడానికి శరద్ ప్రయత్నిస్తున్నారు. 

కార్మికులు, దళితులు, గిరిజనులు, సమాజంలోని ఇతర బలహీన వర్గాలవారి సంక్షేమానికే  తన శేష జీవితాన్ని అంకితం చేస్తానని శరద్ ప్రకటించారు. వంచిత్ బహుజన్ ఆఘాడీ  మద్దతుదారులను తనవైపు తిప్పుకునేందుకు ఎన్సీపీ ఎత్తుగడ పనికొస్తుంది. కడచిన పార్లమెంటరీ ఎన్నికల్లో వీబీఏ పది శాతం పైగా ఓట్లు తెచ్చుకుంది.  మహారాష్ట్రలో అగ్ర కులాలవారు, సంపద నిచ్చెనపైకి ఎగబాకుతున్న ఇతర వెనుకబడిన కులాల వారు, పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజలు బీజేపీ మద్దతుదారులుగా పేరుపడ్డారు. దీనినిబట్టి, ఎన్సీపీ వచ్చే ఎన్నికల్లోనూ ఎంవీఏ లోనే కొనసాగవచ్చునని స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలతోపాటు, మహారాష్ట్ర శాసన సభకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో సాధించే విజయాలను బట్టి శరద్ రాజకీయ ఎత్తుగడ నిజంగా ఫలితమిచ్చిందో లేదో తెలుస్తుంది. 

అజీత్ అడుగు ఎటు?

సమస్యల్లో అవకాశాలను కనుగొనగలిగినవారినే  విజయం వరిస్తుందని చైనా నానుడి. మొత్తం 288 సభ్యులున్న శాసన సభలో 53 మంది ఎన్సీపీ సభ్యులతో అజీత్ పవార్ ప్రస్తుతం ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. బీజేపీ 105 మంది సభ్యులతో పాలక కూటమిలో పెద్ద భాగస్వామ్యపక్షంగా ఉంది. కాంగ్రెస్ కు 45 మంది సభ్యులున్నారు. కార్యకర్తల మద్దతు పుష్కలంగా ఉన్న అజీత్ పవార్ మరోసారి తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి ప్రయత్నించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయనది తొందరపాటుతనమో లేక రాజకీయంగా ముందు చూపో కూడా తెలియగల సందర్భాలు మున్ముందు రానున్నాయి. రాష్టం నుంచి ఏకైక కాంగ్రెస్ లోక్ సభ (చంద్రపూర్) సభ్యునిగా ఉన్న సురేశ్ ధానోర్కర్ , పుణే నుంచి బీజేపీ లోక్ సభ సభ్యునిగా ఉన్న గిరీశ్ బాపట్ ఇటీవల చనిపోయారు. 

ఒక వార్తా చానల్ నిర్వహించిన తాజా ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలను బట్టి మహారాష్ట్ర అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ-శివసేన (ఏక్ నాథ్ ) కూటమికి 165 నుంచి 185 సీట్లు రాగల అవకాశం ఉంది.  ఆ సర్వేలో బీజేపీకి 30.2 శాతం, శివసేన (ఏక్ నాథ్ శిందే వర్గం)కి 16.2 శాతం ప్రజల మద్దతు లభించింది. శిండే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని 26.1 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి పదవిలో చూడాలనుకుంటున్నవారు 23.2 శాతం మంది ఉన్నారు. కనుక, అజీత్ మరికొంత కాలం ఓపిక పట్టడం తప్పకపోవచ్చు. 

సుప్రియా సూలేదే రెండో స్థానం

పవార్​ తన కుమార్తె సుప్రియా సూలేకి పార్టీ పగ్గాలు అప్పగించడం. ప్రఫుల్ పటేల్ తోపాటు ఆమెను కూడా పార్టీకి సహ కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా ప్రకటించడం ద్వారా శరద్ పవార్ వారసత్వ సంక్షోభానికి తెరదించారు. అదను చూసి నిర్ణయాన్ని ప్రకటించడం ద్వారా పార్టీ కేవలం ఆయన కుటుంబానికే పరిమితమైందనడానికి లేకుండా చేశారు. మరోరకంగా, వారసత్వ రాజకీయాలకు సాఫీగా ఆమోద ముద్ర వేయించుకున్నారు. పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీకి సుప్రియా సూలేను అధ్యక్షురాలిని చేశారు. పార్టీ మహారాష్ట్ర ఇన్-చార్జిగా కూడా ఆమె వ్యవహరిస్తారు. దాంతో పార్టీలో శరద్ తర్వాత రెండవ స్థానం ఆమెదేనని సూత్రప్రాయంగానైనా ప్రకటించినట్లైంది. అదను చూసి ఈ నిర్ణయాలను ప్రకటించడంలోనే శరద్ పవార్ గడుసుతనం కనిపిస్తోంది. ప్రత్యర్థి శిబిరం ప్రలోభాలకు లొంగకుండా పార్టీని కాపాడుకునేందుకే ఇదంతా చేసినట్లు ఆయన చెప్పుకోగలుగుతున్నారు. ఇది ఆయన సాధించిన ముఖ్యమైన రెండో ప్రయోజనం. 

ఆశ్చర్యపరచిన శరద్

పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ హఠాత్తుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ, అది అజీత్ కు మార్గం సుగమం చేయడానికి కాదు. పార్టీకి తానే అధినాయకుడినని నిరూపించు కునేందుకు. రాజీనామా ప్రకటనతో సహజంగానే, అట్టడుగు స్థాయి కార్యకర్తల నుంచి శరద్ కు విస్తృతంగా సానుభూతి వ్యక్తమైంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆయన పట్ల తిరుగులేని విధేయతని ప్రకటించింది. పీసీ చాకో వంటి సీనియర్ల వల్ల అసమ్మతికి అడ్డుకట్టపడింది. పార్టీ అధ్యక్ష పదవిలో శరద్ కొనసాగాలని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించడంతో ఆయన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ విధంగా పార్టీకి ఇప్పటికీ తానే బాస్ నని నిరూపించుకున్నారు. వయసుమీద పడినా రాజకీయంగా వన్నె తగ్గలేదని చాటుకున్నారు. ఇది ఆయన సాధించిన మొదటి ప్రయోజనం.

మల్లంపల్లి ధూర్జటి సీనియర్​ జర్నలిస్టు