నవరాత్రి ఉత్సవాలు.. ఋతుస్రావం థీమ్‌తో దుర్గా పండల్

నవరాత్రి ఉత్సవాలు.. ఋతుస్రావం థీమ్‌తో దుర్గా పండల్

నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఈ వేడుకలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పలు దుర్గా పూజ కమిటీలు తమ సామర్థ్యం మేరకు గొప్ప దుర్గాపూజ పండళ్లను నిర్మించాయి. ఈ క్రమంలో, రుతుక్రమానికి సంబంధించిన అపోహలను తొలగించడమే లక్ష్యంగా మహానగరంలో దుర్గాపూజ పండల్ ను రూపొందించింది ఓ దుర్గా పూజ కమిటీ.

గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల నివాసమైన జోరాసాంకో సమీపంలోని ఉత్తర కోల్‌కతాలోని చిట్‌పూర్ ప్రాంతంలో ఉన్న దుర్గా పూజా పండల్.. ఈ సంవత్సరం దుర్గా పూజను జరుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన థీమ్‌తో ముందుకు వచ్చింది. ఋతుక్రమం గురించిన అపోహలను తొలగించడం, ఋతు పరిశుభ్రత గురించి అవగాహన పెంచడమై ఈ పండల్ మెయిన్ థీమ్.

ఋతుస్రావం థీమ్‌తో దుర్గా పండల్

ఈ దుర్గాపూజ పండల్ లో మహిళల చిత్రాలు, శానిటరీ ప్యాడ్‌లు, ఋతుచక్రాన్ని వర్ణించే చిత్రాలతో అలంకరించారు. స్త్రీత్వాన్ని జరుపుకోవడానికి, పునరుత్పత్తి చక్రంలో ఋతుక్రమం ప్రాముఖ్యతను గుర్తించడానికి ఈ థీమ్ ప్రజలను ప్రేరేపిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. పంచర్ పల్లి దుర్గాపూజ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తుండడం ఇది 84వ సంవత్సరం.

'ఋతుక్రమానికి సంబంధించి మన సమాజంలో చాలా నిషిద్ధాలు ఉన్నాయి. ఈ సమయంలో కొంతమంది స్త్రీలకు వంటగదిలోకి వెళ్ళడానికి అనుమతి ఉండదు. మరికొందరు ఏ ఆహార పదార్థాన్ని ముట్టుకోకూడదు, దేవాలయాలు, మసీదులు లేదా చర్చిలకు వెళ్ళడానికి అనుమతించరు. చంద్రునిపై చంద్రయాన్‌ను ల్యాండ్‌ చేసినందుకు గర్విస్తున్న ఈ రోజు కూడా ఈ రకమైన నిషేధాలు ఎందుకు ఉన్నాయి?' అని ఈ సందర్భంగా పాతూరియాఘాట్ పంచర్ పల్లి సర్వజనిక్ దుర్గాపూజ కమిటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎల్లోరా సాహా ప్రశ్నించారు.

ఈ వినూత్నమైన పండల్ ఆలోచన సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. X యూజర్లు  నిర్వాహకులను ప్రశంసించడమే కాకుండా, ఈ థీమ్ కారణానికి గానూ శుభాకాంక్షలను కూడా తెలియజేశారు. ఈ తరహా పండల్ ఆలోచనలే అమ్మవారిని పూజించడానికి నిజమైన మార్గం అని కూడా ఒక యూజర్ కామెంట్ చేశారు.