టీకాల్లోనూ కమీషన్ల కక్కుర్తేనా  ?

టీకాల్లోనూ కమీషన్ల కక్కుర్తేనా  ?
  • మీకు దొరకని వ్యాక్సిన్లు ప్రైవేటుకు ఎలా దొరుకుతున్నాయి కేసీఆర్
  • కమీషన్లకు ఆశపడా.. లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా..
  • ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..? 
  • కేసీఆర్ పై వైఎస్ షర్మిళ ఘాటు ప్రశ్న

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిననాటి నుండి ఎక్కడ ఏ అవినీతి జరిగినా.. లేక పాలనా వైఫల్యం కనిపించినా సర్కారును కడిగి పారేస్తున్న వైఎస్ షర్మిళ తాజాగా కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సర్కారుకు దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేటుకు ఎలా దొరుకుతున్నాయంటూ ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా..? లేక కమీషన్లకు ఆశపడా..? ఇంకెన్నాళ్లు దొరకా మూతకండ్ల పరిపాలన..? అంటూ ట్విట్టర్ లో కేసీఆర్ ను నిలదీశారు షర్మిళ. ఆదివారం వీ-6 వెలుగు దినపత్రికలో వచ్చిన బ్యానర్ వార్త ‘‘ ప్రైవేటు ఆస్పత్రుల దందా.. టీకా దందా.. ఒక్కో డోసుకు రూ.1250 నుంచి 1600.. కేవలం 5 రోజుల్లో 6.15 కోట్ల బిజినెస్ జరిగిందని.. కేవలం సర్వీస్ చార్జీలే 6.15 కోట్లు వసూలయ్యాయంటూ’’ వచ్చిన కథనాన్ని తన ట్విట్టర్ అకౌంట్ కు ట్యాగ్ చేశారు. 
కేసీఆర్ సర్కారు తీరు చూస్తుంటే ‘‘తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడ‌నే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్న‌య్‌. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి.,’’ అని షర్మిళ సూచించారు.