‘భూత్​’ సినిమాలో హీరోయిన్​​కి డూప్​ ఈమె

 ‘భూత్​’ సినిమాలో హీరోయిన్​​కి డూప్​ ఈమె

సనోబర్​ పార్దివాలా.. ఈ పేరు విని ఉండకపోవచ్చు. ఈమెని చూసి ఉండకపోవచ్చు. కానీ, ఈమె పనిని చూసే ఉంటారు. అదెలాగంటారా?  ఒకసారి ఐశ్వర్యారాయ్​, మరోసారి దీపికా పదుకొనే.. ఇంకోసారి కత్రీనా, అలియా, ప్రియాంక, తాప్సీ.. ఇలా ముఖాలు మార్చుకుంటుంది ఈమె. ఈ హీరోయిన్లు సినిమాల్లో చేసే సాహసాల్ని... వాళ్లకి బదులు సనోబర్​ చేస్తుందన్న మాట. ‘ధూమ్–2, విలన్​​, బ్యాంగ్​ బ్యాంగ్​, జగ్గూ జాసూస్, వీర్​జారా, రామ్​లీలా... ఇలా దాదాపుగా 250 సినిమాలకి స్టంట్​విమెన్​గా చేసిన సనోబర్​ సెలబ్రిటీ ఫిట్​నెస్​ ట్రైనర్​ కూడా. మార్షల్​ ఆర్ట్స్​ నేర్చుకుంది. ఎక్సర్​సైజ్​ సైకాలజిస్ట్​గానూ పేరుంది. డీప్​ సీ డైవర్, జిమ్నాసిస్ట్.  కుంగ్​​ఫు, కిక్​ బాక్సింగ్​, క్రావ్​ మాగా, ముయే థాయ్​.. లాంటి వాటిపైనా మంచి పట్టుందీమెకి. సర్టిఫైడ్​ పారా గ్లైడర్​, స్కై డైవర్​ కూడా. బాలీవుడ్​లోని చాలామంది హీరోయిన్లకి న్యూట్రిషనిస్ట్​ ట్రైనర్​గానూ పనిచేస్తోంది. అయితే ఇదంతా పన్నెండేండ్ల వయసులో తను చేసిన ఒక కమర్షియల్​ యాడ్​ నుంచి మొదలైందని చెప్తోంది సనోబర్​. 

16 వ అంతస్తు నుంచి.. 

 

సనోబర్​ పుట్టి, పెరిగిందంతా ముంబైలోనే. చిన్నప్పట్నించీ అడ్వెంచర్స్​ చేయడం అంటే ఇష్టం. అందుకని జిమ్నాస్టిక్స్​ క్లాసులకి వెళ్లింది. స్విమ్మింగ్​ నేర్చుకుంది. పన్నెండేండ్లకే కరాటేలో బ్లాక్​ బెల్ట్​ సాధించింది. ఆ టైంలోనే ఓ డైమండ్ కంపెనీ కమర్షియల్​ యాడ్​కి డూప్​ కావాలనే ప్రకటన కనిపించిందామెకి. ఆ యాడ్​లో ఐశ్వర్యరాయ్​ నటిస్తుందని తెలియడంతో క్షణం ఆలోచించకుండా ఆడిషన్​కి వెళ్లింది. అక్కడికి వెళ్లాక నేలపై పల్టీలు కొట్టమన్నారు. హై జంప్​ చేయమన్నారు. సనోబర్​ టాలెంట్​కి తోడు.. ఐశ్వర్యతో సరిసమానంగా ఎత్తు, రంగు ఉండటంతో వెంటనే ఓకే చేశారు. పదివేలు రెమ్యూనరేషన్​ ఇచ్చారు. ఇరవై ఏండ్ల కిందట పదివేల రూపాయల పారితోషికం అంటే మామూలు విషయం కాదు. అలా ప్యాషన్​నే ప్రొఫెషన్​గా మార్చుకోవాలని సనోబర్​ ఇండస్ట్రీ వైపు అడుగులేసింది. ఆ ప్రయత్నంలో ‘భూత్​’ సినిమాలో హీరోయిన్​​కి డూప్​గా 16 వ అంతస్తు నుంచి కిందకి దూకింది. ఆ ఫీట్ తర్వాత కెరీర్​ గ్రాఫ్​ పైపైకి పాకింది. 

ఆ సాహసాలంటే ఇష్టం

 చదువు కూడా కెరీర్​కి తగ్గట్టే ఉండాలనుకుంది సనోబర్​. అందుకే అమెరికన్​ కాలేజీ ఆఫ్​ స్పోర్ట్స్​ మెడిసిన్​లో ఫిట్​నెస్​, న్యూట్రిషన్​లో డిగ్రీ చేసింది. కరాటే, సీ డైవింగ్​లో అడ్వాన్స్​డ్​​ కోర్సులు చేసింది. అదే టైంలో ఇండస్ట్రీ నుంచి అవకాశాలు అందుకుంది. ‘వీర్​జారా’లో షారుక్​ఖాన్​​తో కలిసి ప్రీతిజింటా ఎత్తైన బిల్డింగ్​పై నుంచి ​దూకే స్టంట్​​​ బాగా పేరు తెచ్చిందామెకి. ‘ధూమ్–2’ లో హృతిక్​ రోషన్​తో కలిసి చేసిన స్టంట్స్​​ ​బాలీవుడ్​ ఫేవరెట్​ స్టంట్ విమెన్ ట్యాగ్ తెచ్చిపెట్టింది. ‘రావణ్​​​​’ , ‘బ్యాంగ్​ బ్యాంగ్’​ సినిమాల్లో చేసిన ఫీట్లు ఇంటర్నేషనల్​ స్టంట్​ అవార్డ్స్​కి నామినేట్​ అయ్యాయి. బాలీవుడ్​లో కరీనా కపూర్​, అనుష్కా శర్మ, సోనాక్షి సిన్హా.. లాంటి స్టార్స్​కి కూడా డూప్​గా చేసింది సనోబర్​.. అయితే కారు,బైక్​లతో చేసే స్టంట్స్​ ఎక్కువ ఎంజాయ్​ చేస్తానంటోంది. 

సవాళ్లు ఎదురయ్యాయి 

ఈ జర్నీలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి అంటోంది సనోబర్. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టంట్​విమెన్​ అనే  కాన్సెప్ట్​ లేకపోవడంతో  అందరూ ఆమెని స్టంట్​మెన్​ అనే పిలిచేవాళ్లు. దాన్ని కరెక్ట్​ చేయడానికి చాలా  పోరాడాల్సి వచ్చిందామె. అన్నింటికీ మించి స్టంట్స్​ కోసం ఫిజికల్​గా ఫిట్​గా ఉండటం ఓ సవాలు అంటుంది​. అలాగే ఈ ప్రొఫెషన్​లో వందకి వంద శాతం హార్డ్​ వర్క్​ ఉండాలి.  అంత కష్టపడ్డా అన్నిసార్లు కాలం కలిసొస్తుందని చెప్పలేం. కోలుకోలేని గాయాలు అవ్వొచ్చు. ఒక ఏజ్​ వచ్చాక.. స్టంట్​ చేయడానికి బాడీ సహకరించదు. అందుకే స్టంట్​విమెన్​ అవ్వాలనుకునేవాళ్లు కచ్చితంగా ఒక బ్యాక్​అప్ ప్లాన్​​ పెట్టుకోవాలి అని చెప్తుంది సనోబర్​.  

‘‘ కలశ్​​​’ అనే హిందీ సీరియల్​లో  హీరోయిన్​కి కాళ్లు, చేతులు కట్టేసి,  నడుముకి ఒక రాయి కట్టి నదిలో ముప్పై అడుగుల కిందికి వదిలే సీన్​ ఉంది. ఆ సీన్​కి హీరోయిన్​ డూప్​గా నేనే చేశా. కిందికి దిగుతున్నా కొద్దీ కళ్లు కనిపించలేదు నాకు. ఆ టైంలో నా బ్రెయిన్​ని నేను కంట్రోల్​ చేసుకున్నా.. స్టంట్స్​ చేసేటప్పుడు ఈ ఎబిలిటీ లేకపోతే  ప్రాణానికే ప్రమాదం. అలాగే నీళ్లలో ఉన్నప్పుడు ప్రతి సెకన్​ ముఖ్యమే.. స్టంట్స్​ కేవలం శరీరంతో చేసేవి కాదు. శరీరంలోని ప్రతి అడుగు, కదలిక వెనుక ఒక లెక్క  ఉండాలి. ఒక్కోసారి వేరేవాళ్ల పొరపాటు వల్ల గాయాలు అవ్వొచ్చు. వాటికి నేనెప్పుడూ సిద్ధమే’’ అంటోంది సనోబర్​.