
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో దేవుని సదానందం అనే మేకలకాపరి ఈ నెల 6న తన ప్రత్యర్థులపై కాల్పులు జరిపేందుకు ఉపయోగించిన ఏకే–47ను హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి మూడేళ్ల క్రితం ఎత్తుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
2017 మార్చి 12, 13 తేదీల్లో ఒకరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో సదానందం ఠాణాకు వచ్చి, బెల్ఆఫ్ ఆర్మ్ తాళాలను దర్జాగా తెరిచి, ఒక ఏకే–47, ఒక కార్బైన్, 30 రౌండ్ల బుల్లెట్స్ ను గోనెసంచిలో వేసుకొని వెంట తెచ్చుకున్న బైకుపై తాపీగా వెళ్లిపోయాడు. ప్రత్యర్థులను భయపెట్టేందుకే సదానందం తుపాకుల చోరీకి పాల్పడ్డాడు. ఈ రెండు మారణాయుధాలు సుమారు మూడేళ్లుగా అతని వద్దే ఉన్నాయి. అందులోని ఏకే–47తోనే ఈ నెల 6న కాల్పులు జరిపాడని సిద్దిపేట జిల్లా ఇన్చార్జి సీపీ శ్వేత వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇన్చార్జి సీపీ చెప్పిన వివరాల ప్రకారం.. అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన దేవుని సదానందంకు మొదటి భార్యతో వివాదాలున్నాయి. ఆ కేసుకు సంబంధించి తరచూ హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ వెళ్తుండేవాడు. అప్పుడే పోలీస్ స్టేషన్ లోని ఆయుధాలపై కన్నేశాడు. ఎలాగైనా ఎత్తుకెళ్తే వాటి సాయంతో ప్రత్యర్థులను భయపెట్టి తన జోలికి రాకుండా చూసుకోవాలని భావించాడు. 2017 మార్చి 12, 13వ తేదీల్లో ఒకరోజు తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. స్టేషన్బయట బైకు నిలిపి లోపలికి వెళ్లాడు. పోలీసులు ఎవరూ కనిపించకపోవడంతో అక్కడే గోడకు తగిలించి ఉన్న తాళం చెవి తీసుకుని బెల్ఆఫ్ఆర్మ్ తెరిచాడు. గదిలో ఉన్న ఒక ఏకే 47, 30 రౌండ్ల బుల్లెట్లు, ఒక కార్బైన్‌ను వెంట తెచ్చుకున్న గోనె సంచిలో వేసుకొని బైకుపై వెళ్లిపోయాడు. ఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత పోలీస్ స్టేషన్లో ఆయుధాల లెక్కింపు సందర్భంగా రెండు వెపన్స్, బుల్లెట్లు మిస్అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు హుస్నాబాద్ పీఎస్‌లో సీఆర్ నంబర్ 51/2018 యు/ఎస్ 409 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
కాల్పులతో బయటపడిన చోరీ
సుమారు మూడేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతుండగా, ఈ నెల 6న రాత్రి 9 గంటల సమయంలో మండల కేంద్రమైన అక్కన్నపేటలో దేవుని సదానందం అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన గుంటి గంగరాజు లక్ష్యంగా వాళ్ల ఇంటి వైపు ఏకే 47తో కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనపై అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో మూడు ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 7న నిందితుడు సదానందంను హుస్నాబాద్ ఎస్సై సుధాకర్ బృందం కొహెడలో అదుపులోకి తీసుకుంది. నిందితుడి నుంచి ఏకే 47తో పాటు 25 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఆయుధాలను హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి దొంగిలించానని సదానందం ఒప్పుకున్నాడు. అతడు చెప్పిన వివరాల మేరకు అదే రోజు సదానందం ఇంట్లో నుంచి కార్బైన్ ఆయుధాన్ని సీఐ శ్రీనివాస్ స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్ కు పంపించారు. తరువాత పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. పోలీస్ స్టేషన్లో ఎవరూ లేని సమయంలో ఆయుధాలను దొంగిలించానని సదానందం అంగీకరించాడని ఇన్ చార్జీ సీపీ శ్వేత విలేకరులకు వివరించారు. ఆ ఆయుధాలను సదానందం ఈ నెల 6న తప్ప గతంలో ఎప్పుడూ వినియోగించలేదని సీపీ తెలిపారు. కేసును అన్ని కోణాల్లో సైంటిఫిక్‌గా విచారించి చార్జీషీటు దాఖలు చేస్తామని, దీనిపై సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ విచారణ జరుపుతున్నారని ఆమె చెప్పారు. ఆయుధాలు మాయమైన రోజు విధి నిర్వహణలో ఉన్న అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. నిందితుడు సదానందంపై ఆయుధాల చోరీతో పాటు, కాల్పులకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.