యూపీ,గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి శివసేన

యూపీ,గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి శివసేన

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో అత్యధిక అసెంబ్లీ స్థానాలతో సీఎం పీఠం దక్కించుకుని పాలిస్తున్న శివసేన రానున్న ఉత్తరప్రదేశ్‌, గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. తరచూ తనను ఇబ్బందిపెడుతున్న బీజేపీని ఎదుర్కొనేందుకు శివసేన ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కదనరంగంలోకి దిగాలని నిర్ణయించింది.  వచ్చే ఏడాది ఆరంభంలో ఈ రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం బిజెపినే అధికారం ఏలుతోంది. 
మహారాష్ట్రలో తమను చికాకుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని గుర్రుగా ఉన్న శివసేన కమల దళాధిపతులైన మోడీ, అమిత్‌షా, నడ్డాల రాజకీయాలను నిలువరించడానికి ఈ రెండు రాష్ట్రాల్లో బరిలోకి దిగడంతోపాటు వీలైనన్నీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని శివసేన ఉవ్విళ్లూరుతోంది. ఇదే విషయంపై శివసేన నాయకుడు సంజరు రౌత్‌ ఆదివారం మీడియా ఎదుట అంగీకరించారు. తమ పార్టీ వీలైనన్ని సీట్లలో పోటీ చేయబోతోందని ఆయన వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ లో  400పైగా అసెంబ్లీ స్థానాలుండగా కనీసం 80కి పైగా సీట్లలో, 40 అసెంబ్లీ సీట్లు ఉన్న గోవాలో 20 స్ధానాల్లో శివసేన బరిలోకి దిగుతుందని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో  ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు.