ఆ ప్రేమకు పట్టాభిషేకం జరిగిన రోజు మహా శివరాత్రి

ఆ ప్రేమకు పట్టాభిషేకం జరిగిన రోజు మహా శివరాత్రి

శివుడు రుద్రుడే కాదు.. సౌమ్యుడు కూడా. ‘శివ’ అంటే సౌమ్యం.. ‘పరమ శివుడు’ అంటే అత్యంత సౌమ్యుడు. ఉంటే నిశ్శబ్దం.. లేకుంటే రోదన.. శ్మశానాన్ని పాలించే శక్తి ఇదే. ఈ శివ శక్తే ప్రేమ స్వరూపం. ఆ ప్రేమకు పట్టాభిషేకం జరిగిన రోజు మహా శివరాత్రి. మాఘమాసాన జరిగిన ఆ వేడుక సందర్భాన్ని గుర్తుచేసే రోజు ఇది. ఆ అర్థ నారీశ్వరుడు ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమ అర్థాంగినే కాదు మఖ నక్షత్రంలో ఉండే చంద్రుడ్ని కూడా ధరించింది. జాబిలిని, గరళాన్ని ధరించిన ఆ నిరాడంబరత లింగమై ఆవిర్భవించిన రోజు ఇది. శివ శక్తి స్వరూపమైన శివ లింగం మారేడు దళాలతో అర్చనే కోరుకుంటుంది. పరమ సత్యాన్నిచెప్పే పరమ శివుడు దేవతలందరికీ భిన్నమైనవాడు.

దేవతలందరూ అలంకార ప్రియులే ఒక్క శివుడు తప్ప. శివుడు అభిషేక ప్రియుడు. ‘పేద, పెద్ద’ అనే తేడా లేకుండా అందరూ శివుడికి అభిషేకం చేయొచ్చు. అందరి కోసం ఆయన మారేడు ఆకుల్ని ఇష్టపడ్డాడు. నేటి ఆదర్శం.. ‘సింప్లిసిటీ’కి ఆద్యుడు శివుడే. ఆ జీవితాదర్శానికి మరో పేరే శైవం. సంపద ఒకచోట పోగుపడుతున్నదని కొన్ని లెక్కలు చెబుతున్నయి.  ఎంతో మంది పేదలుగా మారిపోతున్నరని ఇంకెన్నో లెక్కలు చెబుతున్నయి. ఈ అసమానత మారేదెట్లని ఆలోచిస్తే గుర్తొచ్చే దైవం పరమ శివుడే.

అందరూ స్వీకరించాల్సిన, ఆచరించాల్సిన ఆదర్శం శైవం. లింగోద్భవ పూజ చేసి, నదీ స్నానం ఆచరించి, పితృదేవతలను స్మరించుకుంటూ ఉపవాసం ఆచరించే రాత్రి ఇది. శ్మశానం అతడి నివాసం.  ఎంతటి విలాస జీవితమైనా ముగిసేది ఈ శ్మశానంలోనే అన్న జీవిత సత్యాన్ని చాటే దేవాది దేవుడు శివుడు. ఆ శివుని కొలిచే సందర్భంలో గ్రహించాల్సిన సత్యం ఇదొక్కటే.