ఇండియా - శ్రీలంక మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన అక్తర్

ఇండియా - శ్రీలంక మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన అక్తర్

ఆసియా కప్ 2023లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 41 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. చేసింది తక్కువ పరుగులే అయినా.. దాన్ని కాపాడడంలో భారత బౌలర్లు శభాష్ అనిపించారు. మొదట టీమిండియా 213 పరుగులు చేయగా.. లక్ష్య చేధనలో లంకేయులు 171 పరుగులకే కుప్పకూలారు. ఈ గెలుపుతో టీమిండియా సగర్వంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. అయితే ఇది లో స్కోర్ గేమ్ కావడంతో ఫిక్సింగ్ ఆరోపణలు గప్పుమన్నాయి. –

తొలి ఇన్నింగ్స్ ముగియగానే విమర్శలు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి 20 ఓవర్లు బాగానే ఆడినప్పటికీ.. ఆ తరువాత కుప్పకూలింది. దీంతో కొందరు పాక్ అభిమానులు.. పని గట్టుకొని సోషల్ మీడియాలో మ్యాచ్ ఫిక్సింగ్ విమర్శలు చేశారు. పాక్ జట్టును ఇంటికి పంపించాలానే ఉద్దేశ్యంతో ఇండియా కావాలనే శ్రీలంక చేతుల్లో ఓడిపోతోందని  ఆరోపించారు. అయితే ఈ విమర్శలను పాక్ మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్ ఖండించాడు.

శ్రీలంకను చిత్తుగా ఓడించిన భారత జట్టుపై ప్రశంసలు కురిపించిన అక్తర్.. ఇలాంటి ఆరోపణలు చేసే వారికి బుర్ర పని చేస్తోందా! అని ప్రశ్నించాడు. గెలిస్తే ఫైనల్ చేరే అవకాశం ముందున్నప్పుడు ఏ జట్టైనా.. ఓడిపోవాలని అనుకుంటరా! అని ప్రశ్నలు సంధించి విమర్శకుల నోర్లు మూయించాడు.

Also Read :- పాకిస్తాన్‌‌తో మొదలైన ప్రస్థానం: కెప్టెన్‌గా ధోనికి 16 ఏళ్లు

తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అక్తర్.. "భారత జట్టు మ్యాచ్ ఫిక్స్ చేసిందని నాకు సందేశాలు వస్తున్నాయి. పాకిస్తాన్‌ను ఇంటికి పంపించాలానే ఉద్దేశ్యంతో ఇండియా కావాలనే ఓడిపోతున్నారని అంటున్నారు. అసలు మీకు బుర్ర పని చేస్తోందా? శ్రీలంక బౌలర్లు ఎంత బాగా బౌలింగ్ చేశారు. వెల్లలాగె, అసలంక అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఆ 20 ఏళ్ల యువకుడిని చూడండి.. అతని పోరాటాన్ని చూడండి.. 5 వికెట్లు తీశాడు.. 43 పరుగులు చేశాడు.." అని తెలిపాడు.

ఇక భారత బౌలర్ల పోరాటం గురుంచి మాట్లాడిన అక్తర్.. "వాళ్లు ఎందుకు ఓడిపోవాలని అనుకుంటారు చెప్పండి? ఇలాంటి సమయంలో ఏ జట్టైనా మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరాలని అనుకుంటుంది. భారత్ గొప్పగా పోరాడింది. కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బుమ్రాను చూడండి. చిన్న టార్గెట్ కూడా ఎలా డిఫెండ్ చేశారో.. ఎలాంటి కారణం లేకుండా మీమ్స్ చేస్తున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.. " అని అక్తర్ చెప్పుకొచ్చాడు.