కొండగట్టు, వెలుగు: దేవాదాయ శాఖ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం కుటుంబ సమేతంగా కొండగట్టు అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి వెంట వచ్చిన పర్సనల్ సెక్యూరిటీ వెపన్తోనే అంతరాలయంలోకి రావడం దుమారం రేపింది.
ఆలయ నియమాల ప్రకారం.. వెపన్తో వెళ్లడం నిషేధం. పూజా కార్యక్రమం పూర్తయ్యే దాకా వెపన్తో సిబ్బంది అంతరాలయంలోనే ఉన్నా ఆలయ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఆలయ అధికారుల తీరుపై సామాన్య భక్తులు మండిపడ్డారు. వెపన్స్తో ఆలయంలోకి రావడం ఏంటని ఆలయ అధికారుల తీరును నిలదీశారు.
కొండగట్టు ఆలయ అర్చకులు, అధికారులు మాజీ మంత్రికి ఘనంగా స్వాగతం పలికి దర్శనానంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కొండగట్టు అంజన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. ఈఓ అంజనా రెడ్డి, సూపరిండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
