అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన 12 గంటల్లోపే పెళ్లి కొడుకు శోభనం గదిలోనే చనిపోయాడు. పత్తిపాటివారిపల్లెకు చెందిన తులసీ ప్రసాద్.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. తులసీప్రసాద్ కు హైదరాబాద్ లోనే శిరీషతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని రెండు కుటుంబాలను ఒప్పించారు. బంధుమిత్రుల సమక్షంలో సోమవారం రోజు తులసీప్రసాద్, శిరీషల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటంతో వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేశాడు పెళ్లికొడుకు.
అందరితో సంతోషంగా గడిపిన తులసీప్రసాద్ భవిష్యత్ ప్రణాళికపై శిరీషతో మాట్లాడాడు. ఉదయం 3 గంటలకు శిరీషకు మెలుకువ రావటంతో పెళ్లికొడుకును లేపింది. ఎంత పిలిచినా తులసీప్రసాద్ లేవకపోవటంతో ఆందోళన చెందిన శిరీష కేకలు వేసింది. దీంతో బంధువులు వెంటనే అతన్ని మదనపల్లి హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే తులసీ ప్రసాద్ మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. పెళ్లయిన 12 గంటల్లోనే పెళ్లికొడుకు చనిపోవటంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
