
- బిడ్డ మృతికి తండ్రి చేతబడినే కారణమని అనుమానం
- అఘాయిత్యానికి పాల్పడిన పెద్ద కొడుకు, అతని మేనల్లుడు
- కల్వకుర్తి డీఎస్పీ సాయి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి
కల్వకుర్తి, వెలుగు: తండ్రిని కొడుకు దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కల్వకుర్తి డీఎస్పీ సాయి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కల్వకుర్తి టౌన్ లోని వాసవి నగర్ కు చెందిన బాలయ్య(75)కు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఇటీవల పెద్ద కొడుకు బీరయ్య కూతురు అనారోగ్యంతో చనిపోయింది. ఇందుకు తండ్రి బాలయ్య చేతబడి చేయడమే కారణమని అనుమానించాడు. అంతేకాకుండా భూ తగాదాలు, కుటుంబంలో మనస్పర్థలు కూడా తోడయ్యాయి. దీంతో కక్ష కట్టిన బీరయ్య తండ్రిని చంపేందుకు ప్లాన్ చేశాడు.
గత బుధవారం బాలయ్య పొలం వద్దకు వెళ్తుండగా.. కొడుకు బీరయ్య వెనకాలే వెళ్లి కర్రతో తండ్రిని కొట్టిచంపాడు. అనంతరం వంగూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన తన మేనల్లుడు ఒరే అంజికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. కల్వకుర్తిలో ఉన్న అంజి కారులో పొలం వద్దకు వెళ్లాడు. ఇద్దరూ కలిసి డెడ్ బాడీని కారు డిక్కీలో వేసుకుని వంగూరు మండలంలోని డీఎల్ఐ కాల్వ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలయ్య చెవులకు ఉన్న గోల్డ్ రింగులను తీసుకున్నారు. అనంతరం రంపంతో కోసి డెడ్ బాడీ తల, మొండెం వేరు చేశారు. అనంతరం తలను డీఎల్ఐ కాల్వలో, మొండాన్ని చింతపల్లి వద్ద డిండి వాగులో పడేశారు. బాలయ్య సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో చిన్న కొడుకు మల్లయ్య కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు.
మరుసటి రోజు పొలంలోని షెడ్డు వద్ద బాలయ్య హోండా యాక్టివా కనిపించింది. పరిసరాల్లో వెతకగా రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే కల్వకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి వెళ్లిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలయ్యను కొడుకు బీరయ్య కర్రతో కొట్టిన చంపిన దృశ్యాలు కనిపించాయి. ఆదివారం కొట్రా– జయప్రకాశ్ రోడ్డులో వెళ్తున్న బీరయ్య, అంజిలను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. మృతుడి చిన్న కొడుకు మల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.