
- శవాన్ని అదే దారిలో తీసుకెళ్లాలని వాయిస్ రికార్డ్
- మెదక్ జిల్లా ఘవేలీఘనపూర్ మండలంలో ఘటన
మెదక్, వెలుగు: తన ఇంటికి దారి ఇవ్వకుండా పాలోళ్లు ఇబ్బందులు పెడుతున్నారన్న మనస్తాపంతో పురుగుల మందు తాగిన వ్యక్తి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ‘నేను చనిపోయాక నా శవాన్ని అదే దారిలో తీసుకెళ్లండి’ అంటూ వాయిస్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం మండలం వాడి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గుడిపల్లి సుభాష్‌రెడ్డి (48)కి ఇంటి వద్ద జాగా విషయంలో పాలోళ్లతో గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో కొన్ని రోజుల కింద దారికి అడ్డంగా గేటు ఏర్పాటు చేసి సుభాష్‌రెడ్డి ఇంటికి దారి లేకుండా చేశారు. ఈ విషయమై సుభాష్‌రెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణితో పాటు జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్లాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురైన సుభాష్‌రెడ్డి ఈ నెల 3న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మెదక్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు.
కాగా, పురుగుల మందు తాగడానికి ముందుగా.. ‘పాలోళ్ల కారణంగానే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. నేను చనిపోయాక అయినా నా మృతదేహాన్ని అదే దారిలో తీసుకెళ్లండి’ అంటూ వాయిస్ రికార్డు చేసి వాట్సప్ గ్రూప్స్‌లో పోస్ట్ చేశాడు. బుధవారం సుభాష్‌రెడ్డి చనిపోయిన విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామంలోని అతడి ఇంటికి చేరుకొని దారికి అడ్డంగా ఏర్పాటు చేసిన గేటును ధ్వంసం చేశారు. సుభాష్‌రెడ్డి మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. మృతుడి భార్య అనూష ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు హవేలీ ఘనపూర్ పోలీసులు తెలిపారు.