ఆసుపత్రుల్లో నర్సుల కొరత.. పెరుగుతున్న ఆట్రిషన్​ రేట్లు

ఆసుపత్రుల్లో నర్సుల కొరత..  పెరుగుతున్న ఆట్రిషన్​ రేట్లు
  • అధికమవుతున్న నర్సుల కొరత

న్యూఢిల్లీ:ఉద్యోగుల రాజీనామాలతో ఆసుపత్రులు సతమతమవుతున్నాయి. పెరుగుతున్న అట్రిషన్‌‌ను (ఉద్యోగాన్ని వదిలేయడం) నిరోధించడానికి మార్గాలను వెతుకున్నాయి. ప్రధానంగా నర్సుల కొరత హెల్త్​కేర్​ ఇండస్ట్రీని ఇబ్బందిపెడుతోంది. పెద్ద ఆసుపత్రులలో పర్మనెంట్​, టెంపరరీ వర్క్​ఫోర్స్​కు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో కంపెనీలు ట్యాలెంట్​ వేటలో పడ్డాయి. ఫోర్టిస్ హెల్త్‌‌కేర్, మెదాంత,  యథార్థ్​ హాస్పిటల్స్‌‌లో 30 శాతానికి పైగా అట్రిషన్​ కొనసాగుతోంది. 16–-17 శాతం వార్షిక వృద్ధిరేటు ( సీఏజీఆర్) ఉన్న హెల్త్​కేర్​ రంగం విస్తరణ కారణంగా ఉద్యోగులకు కొరత ఏర్పడింది.  2023 చివరి నాటికి ఈ రంగం మార్కెట్​సైజు 132 బిలియన్​ డాలర్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది.  యథార్త్ హాస్పిటల్స్‌‌ డాక్టర్లలో అట్రిషన్ 46 శాతానికి పైగా ఉండగా, నర్సులలో ఇది దాదాపు 74 శాతానికి పెరిగింది.“2023 ఆర్థిక సంవత్సరంలో మా అట్రిషన్ రేటు ఎక్కువే ఉంది. 

ఎక్కువ అర్హతలు కలిగిన హెల్త్​కేర్​ నిపుణులను ఆకర్షించాలని అనుకుంటున్నాం. రూల్స్​ ప్రకారం పని చేసేలా వీరిని ఒప్పించడంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు’’ అని కంపెనీ బీఎస్​ఈ  ఫైలింగ్‌‌లో తెలిపింది. గత రెండు సంవత్సరాలుగా మేదాంతలో 35 శాతం వరకు అట్రిషన్ రేటు ఉంది. నర్సులు,  జూనియర్ డాక్టర్లకు డిమాండ్​ ఎక్కువగా ఉందని ఇది తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. మెదాంత, పారస్, మణిపాల్,  అపోలో హాస్పిటల్స్ ఈ సమస్యపై అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు. ఫోర్టిస్ హెల్త్‌‌కేర్  మొత్తం యానువల్​ అట్రిషన్ 1.5 శాతం మెరుగుపడింది. నర్సుల రాజీనామాలు తగ్గాయి. ఉద్యోగులను నిలుపుకోవడానికి ఇది బాగా ఖర్చు పెడుతోంది. 

భారీగానే జీతభత్యాలు..

ఫోర్టిస్ వర్క్‌‌ఫోర్స్‌‌లో నర్సులు,  టెక్నీషియన్లు 70 శాతం మంది ఉన్నారు కాబట్టి ఈ సంస్థ జీతాలు బాగానే ఇస్తోంది.   వారి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. గత రెండు సంవత్సరాలుగా నర్సులను ఫోర్టిస్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్​బీ), టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్​)లో హెల్త్‌‌కేర్ మేనేజ్‌‌మెంట్ ప్రోగ్రామ్‌‌ల కోసం పంపిస్తోంది.   నర్సుల్లో అట్రిషన్ 60-–65 శాతం ఉండగా,  ఫోర్టిస్​లో ప్రస్తుతం 40-–45 శాతం వరకు ఉంది. అదనంగా ఈ కంపెనీ ‘నిలుపుదల చెల్లింపు’(రిటెయినింగ్​ పే)  రూపంలో లాంగ్​టర్మ్​ ఇన్సెంటివ్స్​లను (ఎల్​టీఐ) ఇస్తోంది. - “ఆసుపత్రి పరిశ్రమలకు ఉద్యోగులు సరిగా దొరకడం లేదు. ఉదాహరణకు, ఒక నర్సు ఉద్యోగం ఇవ్వడానికి మేం చాలా మంది  ప్రొఫైల్స్​ను చూస్తాం. అయినా సరైన వాళ్లు దొరకడం లేదు.

 ఉన్నతస్థాయి ఉద్యోగాలకూ సరైన వాళ్లు రావడం లేదు”అని ఫోర్టిస్ హెల్త్‌‌కేర్‌‌లోని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రంజన్ పాండే అన్నారు. నర్సులతోపాటు కొన్ని ఆస్పత్రులు హెచ్​ఆర్​, ఫైనాన్స్​ ఉద్యోగులు దొరక్క ఇబ్బందిపడుతున్నాయని వాక్​వాటర్​ ట్యాలెంట్ అడ్వైజర్స్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ప్రకాష్​ చెప్పారు. అట్రిషన్​ను ఆపడానికి ఆస్పత్రులు 8–1‌‌‌‌0 శాతం ఇంక్రిమెంట్లు, ఈసాప్స్​/స్టాక్​ఆప్షన్స్​ఇస్తున్నాయని చెప్పారు. ఆసియా హెల్త్​కేర్​ హోల్డింగ్స్​, నోవా ఐవీఎఫ్​ ఫెర్టిలిటీ వంటివి రాజీనామాలను తగ్గించడానికి త్వరగా ప్రమోషన్లు ఇస్తున్నాయి.