ఆ ట్వీట్లకు రీచ్ కూడా ఎక్కువ ఉండదు : ఎలాన్ మస్క్

ఆ ట్వీట్లకు రీచ్ కూడా ఎక్కువ ఉండదు : ఎలాన్ మస్క్

ట్విట్టర్ డీల్ ను ఇటీవలే పూర్తి చేసిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ లో ఎన్నో మార్పులు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే విద్వేష వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ఓ కొత్త పాలసీని తీసుకొచ్చినట్టు మస్క్ చెప్పారు. అందులో భాగంగా నిషేధించిన డోనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరిణపై స్పందించారు. ఇప్పటికే కొందరి అకౌంట్ ను పునరుద్ధరించామని, అయితే ట్రంప్ ఖాతా గురించి మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ విషయంపై  మస్క్ పోలింగ్‌ కూడా నిర్వహించారు. ప్రజల నిర్ణయమే, దేవుడి నిర్ణయంగా భావిస్తానని మరో ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇప్పటివరకు ఈ పోలింగ్‌లో 50లక్షల మందికి పైగా పాల్గొనగా.. దాదాపు సగం మంది ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించేందుకు అనుకూలంగా ఓట్లేసినట్లు తెలుస్తోంది.

ఆ ట్వీట్లపై కొత్త పాలసీ..

ట్విటర్‌ కొత్త పాలసీ గురించి మస్క్‌ వివరిస్తూ.. విద్వేష/ప్రతికూల ట్వీట్లను గుర్తించి వాటిని డీబూస్ట్‌ చేయడం లేదా వాటి స్థాయిని తగ్గిస్తామన్నారు. మాట్లాడే స్వేచ్ఛం అందరికీ ఉంటుందన్న ఆయన.. కానీ విద్వేష ట్వీట్ల గురించి ప్రత్యేకంగా వెతికితే తప్ప అవి అందరికీ కన్పించవని, వాటికి ఎక్కువ రీచ్‌ కూడా ఉండదు. అయితే ఇది కేవలం ట్వీట్లకు మాత్రమే వర్తిస్తుందన్న మస్క్... మొత్తం ట్విటర్‌ ఖాతాకు కాదని స్పష్టం చేశారు. 

ట్రంప్ ఖాతాపై నిషేధం ఎందుకంటే...

2021లో క్యాపిటల్‌ హిల్‌పై దాడి సందర్భంగా ట్రంప్‌ ఖాతాపై ట్విటర్‌ శాశ్వత నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆరంభంలో ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించినప్పటి నుంచి ట్రంప్‌ ఖాతాను మళ్లీ పునరుద్ధరిస్తారని ఊహాగానాలు వచ్చాయి. దీనిపై ఆ మధ్య మస్క్‌ కూడా స్పందిస్తూ.. అందుకు తాను కూడా అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ట్విటర్‌ నిషేధం తర్వాత ట్రంప్‌ సొంతంగా ‘ట్రూత్‌’ పేరుతో ఓ సోషల్‌మీడియా సంస్థను ప్రారంభించారు. ఒకవేళ.. తన ట్విటర్‌ ఖాతాను పునరుద్ధరించినా మళ్లీ అందులో చేరే ఉద్దేశం తనకు లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.