IND vs ENG: గాయాల బెడద..సిరీస్ మొత్తానికి దూరమైన స్టార్ బ్యాటర్

IND vs ENG: గాయాల బెడద..సిరీస్ మొత్తానికి దూరమైన స్టార్ బ్యాటర్

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తప్పుకోగా బుమ్రాకు రెస్ట్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహమ్మద్ షమీ, జడేజా గాయాల నుంచి కోలుకుంటుండగా.. రాహుల్ మూడో టెస్టులో ఆడతాడో లేదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో టీమిండియాకు మరొక బ్యాడ్ న్యూస్. నివేదికల ప్రకారం మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ మూడో టెస్ట్ నుంచి దూరం కానున్నాడు.

ప్రస్తుతం అయ్యర్ వెన్ను సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ప్రాక్టీస్ చేసే సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. తనను గాయం వేధిస్తోందని భారత క్రికెట్ జట్టు వైద్య సిబ్బందికి తెలియజేసాడు. ఫార్వర్డ్ డిఫెన్స్, ఇతర స్ట్రోక్‌లను ఆడుతున్నప్పుడు గజ్జల్లో నొప్పి వస్తుందని తెలిపాడు. శస్త్రచికిత్స తర్వాత మొదటిసారిగా అయ్యర్ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. కోలుకోవడానికి కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యలు సూచించినట్టు సమాచారం.

Also Read : రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య సమరం.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

 
వైజాగ్ టెస్ట్ గెలుపు తర్వాత భారత ఆటగాళ్ల కిట్‌లు వైజాగ్‌ నుంచి నేరుగా మూడో టెస్టు వేదిక రాజ్‌కోట్‌కు వెళ్లగా, శ్రేయాస్ అయ్యర్ కిట్‌ని అతని స్వస్థలం ముంబైకి పంపించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అయ్యర్ పేలవ ఫామ్ లో ఉన్నాడు. సౌతాఫ్రికాతో  టెస్టు సిరీస్ లో ఘోరంగా విఫలమైన ఈ ముంబై బ్యాటర్.. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో నిరాశ పరిచాడు. ఈ నాలుగు టెస్టుల్లో 8 ఇన్నింగ్స్ లు ఆడిన అయ్యర్.. ఒక్కసారి కూడా 50 పరుగుల మార్క్ చేరుకోలేకపోయాడు. 

అయ్యర్ దూరమైతే తుది జట్టులోకి సర్ఫరాజ్ అహ్మద్ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాయపడటంతో రెండో టెస్టుకు ఎంపికైన సర్ఫరాజ్ తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. 5 టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి.     మూడో టెస్ట్ రాజ్ కోట్ వేదికగా ఫిబ్రవరి 15 న జరగనుంది. చివరి మూడు టెస్టులకు భారత జట్టును నేడు (ఫిబ్రవరి 9) ప్రకటించే అవకాశం ఉంది.