
నామ్ కే వాస్తేగా నడుస్తున్న వెహికల్స్
హైదరాబాద్, వెలుగు: మెట్రో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ తిప్పలు తప్పడం లేదు. ట్రైన్ దిగగానే గమ్యస్థానాలను చేరుకునేందుకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా షెటిల్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు తెలిపారు. కానీ వీటి సేవలు సరిగా అందడంలేదు. నామ్ కే వాస్తేగా నడిపిస్తున్నారు. మూడు కారిడార్లలో 57 మెట్రో స్టేషన్లు ఉండగా కేవలం ఏడు చోట్ల మాత్రమే షెటిల్, ఫీడర్ వెహికల్స్ ని మెట్రో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. అయితే కరోనా కంటే ముందు అందుబాటులో ఉన్నా ప్రస్తుతం కనిపించడంలేదని ప్రయాణికులు చెప్తున్నారు. ఏడు స్టేషన్లలో కొన్ని చోట్ల మాత్రమే ఫీడర్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. కాగా వీటి టైమింగ్స్ తెలియక ప్రయాణికులు ప్రైవేట్ వెహికల్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
స్విదా సర్వీసెస్, థింక్ క్రేజీ అనే స్టార్టప్‌లతో అనుసంధానమైన మెట్రో.. ఫీడర్ సర్వీసులను అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఇవి చెప్పిన చోట కనిపించడంలేదని ప్రయాణికులు అంటున్నారు. దీంతో మెట్రో దిగాక లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ఇబ్బందులు తప్పడంలేదు. గతంలో మెట్రో స్టేషన్ నుంచి పలు ఏరియాలకు స్విదా పేరుతో షెటిల్ వెహికల్స్ అందుబాటులో ఉండేవి. కరోనా తర్వాత వాటిని చాలా చోట్ల తీసేశారు. రాత్రి సమయంలో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తిరిగి ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
నో టైమింగ్స్..
రాయదుర్గం, పరేడ్‌గ్రౌండ్స్, మెట్టుగూడ, ఎల్‌బీనగర్, ఉప్పల్, కేపీహెచ్‌బీ, మియాపూర్ మెట్రో స్టేషన్ల మీదుగా ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మార్గాల్లో ఈ–ఆటోలు, టాటా వింగర్‌లు ఉన్నాయని అధికారులు తెలిపారు. గతంలో పది, పదిహేను సీటర్ల ఫీడర్ వెహికల్స్ ఉండగా కొన్ని నెలల క్రితం ఎలక్ట్రిక్ ఆటోలు, స్కూటీలను తీసుకొచ్చారు. ప్రస్తుతం రాయదుర్గం, హైటెక్ సిటీ, దుర్గం చెరువు, పరేడ్ గ్రౌండ్స్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ ఆటోలు, స్కూటీలు ఉన్నాయి. మెట్రో రైడ్ అనే యాప్ ద్వారా ఈ సర్వీసెస్‌ని పొందాల్సి ఉంటుంది. కానీ ఈ వెహికల్స్‌కు టైమింగ్ఉండటం లేదు. పది, పదిహేను నిమిషాలకు ఒక రైడ్ ఉంటుందని డ్రైవర్లు చెప్తున్నప్పటికీ ఫీల్డ్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. అరగంటకు పైగానే ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ముగ్గురు మాత్రమే కూర్చోవాల్సి ఉండగా.. షేర్ ఆటో తరహాలో చాలా మందిని ఎక్కించుకుంటున్నారు.
అవి ఉన్నట్లే తెలియదు
ఐటీ ఉద్యోగులు, కాలేజీ స్టూడెంట్స్, రోజువారీ పనుల మీద వెళ్లేవారు ఉదయం, సాయంత్రం మెట్రో సర్వీసెస్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే వీరిలో చాలామంది తమకు మెట్రో తరఫున స్పెషల్ షెటిల్ వెహికల్స్ ఉన్నట్లు తెలియదని చెప్తున్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద నాలుగు షెటిల్ వెహికల్స్ ఉండగా ఇవి ఉదయం ఎంప్లాయిస్ ని విప్రో సర్కిల్ వరకు తీసుకువెళ్తున్నాయి. కానీ 12 గంటల తర్వాత ఇవి కనిపించడంలేదు. ఈ స్టేషన్లకు రెండు వైపులా ఓలా, ఉబర్, షేర్ ఆటోలే అధికంగా కనిపిస్తున్నాయి. మెట్రో దిగి వచ్చిన వెంటనే ప్రయాణికులు వీటినే సంప్రదిస్తున్నారు. కూకట్పల్లి, మియాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్‌లలో షెటిల్ సర్వీసెస్ కనిపించడం లేదు.
మాకు తెలియదు
నేను రోజూ రసూల్ పురా నుంచి పరేడ్ గ్రౌండ్స్ కి వస్తా. ఇక్కడే డిగ్రీ కాలేజ్‌లో చదువుతున్నా. మెట్రో దిగాక రైడ్స్ బుక్ చేసుకుంటా, లేదంటే నడిచి వెళ్తా. కానీ షెటిల్ వెహికల్స్ ఎప్పుడు ఉపయోగించలేదు. రెండేళ్లుగా ట్రావెల్ చేస్తున్నా. కానీ అవి ఉన్నాయని తెలియదు.
- అక్షిత, పరేడ్ గ్రౌండ్స్
ఈ మధ్యకాలంలో చూడలేదు
నేను ఓ కంపెనీలో ఆడిటర్ గా వర్క్ చేస్తున్నా. రాయదుర్గంలో మెట్రో దిగి వెళ్తా. ఈ మధ్యకాలంలో షెటిల్ వెహికల్స్‌ను చూడలేదు. ప్రైవేట్వెహికల్బుక్ చేసుకుని వెళ్తున్నా.
- వెంకట్, రాయదుర్గం
కొవిడ్ తర్వాత కనిపించలేదు
రోజూ ఉప్పల్ నుంచి రాయదుర్గం ట్రావెల్ చేస్తా. కొవిడ్ ముందు షెటిల్ సర్వీసెస్ ఉండేవి. కానీ ఇప్పుడు కనిపించడంలేదు. ఆ యాప్ కూడా వర్కింగ్‌లో లేనట్టు ఉంది.
- శ్రీధర్, ఉప్పల్