- సింధు, సైనా, ప్రణయ్ ముందంజ
సింగపూర్: ఇండియా యంగ్ షట్లర్లు మిథున్ మంజునాథ్, అష్మిత చాలిహా.. సింగపూర్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో సంచలన విజయాలు నమోదు చేశారు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో మిథున్ 21–17, 15–21, 21–18తో వరల్డ్ చాంపియన్ సిల్వర్ మెడలిస్ట్, ఏడోసీడ్ కిడాంబి శ్రీకాంత్‌పై గెలిచాడు. గంటపాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో బాగా ఆడిన శ్రీ.. తర్వాతి రెండు గేమ్‌ల్లో నిరాశపర్చాడు. ప్రత్యర్థి కొట్టిన బలమైన స్మాష్‌లు, ర్యాలీస్‌ను ఎదుర్కోలేక ఏ దశలోనూ పుంజుకోలేకపోయాడు. మరో మ్యాచ్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ 21–13, 21–16తో సితికోమ్ తమాసిన్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో పారుపల్లి కశ్యప్ 14–21, 15–21తో ఐదోసీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో, సమీర్ వర్మ 10–21, 13–21తో లీ షి ఫెంగ్ (జపాన్) చేతిలో ఓడారు. విమెన్స్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్‌లో అష్మిత 21–16, 21–11తో ప్రపంచ 12వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్ (థాయ్‌లాండ్)ను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. 31 నిమిషాల మ్యాచ్‌లో అష్మిత సూపర్ ర్యాలీస్, నెట్ వద్ద డ్రాప్స్‌తో ఆకట్టుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో మూడోసీడ్ పీవీ సింధు 21–15, 21–11తో లిన్నే టాన్ (బెల్జియం)పై, సైనా నెహ్వాల్ 21–18, 21–14తో మాల్వికా బన్సోద్ (ఇండియా)పై గెలిచి సెకండ్ రౌండ్‌లోకి ప్రవేశించారు. డబుల్స్‌లో హు లింగ్ ఫెంగ్–-లిన్ జియో మెన్ (చైనీస్ తైపీ) మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో పూజ దండు–సారా సునీల్‌కు వాకోవర్ విజయం లభించింది. మిక్స్‌డ్‌లో నితిన్–పూర్వీషా రామ్ 21–15, 21–14తో మిషా జిబెల్‌రామన్–స్వెత్లానా జిబెల్‌రామన్ (ఇజ్రాయిల్)పై నెగ్గారు.
