ప్రైమ్​ స్టేషన్లకు ఫుల్ గిరాకీ.. పోటాపోటీగా పోలీస్​ ఆఫీసర్ల పైరవీలు

ప్రైమ్​ స్టేషన్లకు ఫుల్ గిరాకీ.. పోటాపోటీగా పోలీస్​ ఆఫీసర్ల పైరవీలు
  • కాన్సెంట్ లెటర్లు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలకు లక్షల్లో ముడుపులు 
  • లూప్ లైన్ నుంచి లా అండ్ ఆర్డర్ వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు
  • ఎస్సైల నుంచి డీఎస్పీల వరకు లీడర్ల చుట్టూ ప్రదక్షిణలు
  • ఎలక్షన్ ఇయర్ కావడంతో చెప్తే వినేవాళ్ల కోసం ఎమ్మెల్యేల పట్టు

‘‘కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లూప్ లైన్ లో పని చేస్తున్న ఓ ఎస్సై లా అండ్ ఆర్డర్ లో పోస్టింగ్ కోసం ఏడాదిగా జిల్లాలోని ఓ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు. మధ్యవర్తి  ద్వారా అప్పట్లోనే రూ.5 లక్షలు ముట్టజెప్పారు. మూడు నెలల కింద మరో రూ.3 లక్షలు సమర్పించారు.  కానీ సదరు ఎమ్మెల్యే లెటర్ ఇవ్వలేదు. తన పరిధిలో పోస్టింగ్ ఇప్పించలేదు. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మూడేండ్లు దాటినా పోలీస్ ఆఫీసర్ల ట్రాన్స్ ఫర్ కోసం కసరత్తు మొదలు కావడంతో సదరు ఎస్సై మరోసారి ఎమ్మెల్యేను కలిశారు. తీరా ఆ ఎమ్మె ల్యే చేతులెత్తేసి వేరొకరికి మాట ఇచ్చినట్లు చెప్పారు. తన కంటే ఎక్కువ మొత్తం ఇచ్చిన వ్యక్తికే ఎమ్మెల్యే సిఫార్సు చేసినట్లు తెలుసుకుని ఆ ఎస్సై షాక్ తిన్నాడు.’’

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్​ జిల్లా పరిధిలో పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ కోసం ఎస్సైలు, సీఐలు పోటీ పడ్తున్నారు. ఇప్పటికే మారుమూల పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న పలువురు పోలీస్​ ఆఫీసర్లు ఆమ్దానీ ఉన్న పెద్ద పోలీస్ స్టేషన్ల కోసం పైరవీలు చేస్తుండగా.. ఎన్నో ఏండ్లుగా ఎస్బీ, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్​లాంటి లూప్ లైన్ లో ఉన్న ఎస్సైలు, సీఐలు లా అండ్ ఆర్డర్ లో పోస్టింగ్ కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారు. ఇప్పటికే మూడేండ్లు నిండిన ఆఫీసర్లను ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాలకు పంపాలని ఇటీవల ఎన్నికల కమిషన్ ఆదేశించగా  కొందరికి ట్రాన్స్ ఫర్  కంపల్సరీగా మారింది. దీంతో ఎస్సైల నుంచి డీఎస్పీల వరకు పైరవీలు మొదలుపెట్టారు. 

సహకరించేటోళ్ల కోసం లీడర్ల వెతుకులాట.. 

ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఎస్సైలు, సీఐల పోస్టింగుల విషయంలో ఎమ్మెల్యేలు కూడా ఆచీతూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. తమకు బాగా నమ్మకస్తులు, తమ సామాజికవర్గం వారికి పోస్టింగ్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే ఎన్నికల టైంలో తమకు అనుకూలంగా వ్యవహరించేవారికి, చెప్పినట్లు వినేవారిని తమ నియోజకవర్గాలకు ట్రాన్స్ ఫర్ చేయించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీకు మేం సహకరిస్తామంటూ కొందరు పోలీస్ ఆఫీసర్లు కూడా పోస్టింగుల కోసం బీఆర్ఎస్​ నేతల వద్దకు క్యూ కడ్తున్నట్లు తెలిసింది. ఎన్నికల నేపథ్యంలో సిఫార్సు లెటర్లకు ఇచ్చే ముడుపుల విషయంలో కొంత పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ప్రైమ్ స్టేషన్లకు పోటాపోటీ​..

ఉమ్మడి జిల్లాలో ఇసుక, గ్రానైట్ లారీలు వెళ్లే రూట్లలోని పోలీస్ స్టేషన్లు, ఇసుక, మట్టి దందా, జీరో దందా, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువగా నడిచే ఏరియాల్లోని పోలీస్ స్టేషన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాగే పత్తి, రైస్ తోపాటు ఇతర బిజినెస్ లు ఎక్కువగా నడిచే టౌన్ పోలీస్ స్టేషన్ల కూ డిమాండ్ ఉంది. పోలీస్ స్టేషన్లలో  రోటిన్​గా అందే నెలవారీ మామూళ్లు, భూవివాదాల్లో వచ్చే ఆమ్దానీ కోసం ఆయా స్టేషన్లలో పోస్టింగ్ కోసం పలువురు పోలీసాఫీసర్లు పోటీపడ్తున్నట్లు తెలిసింది.