స్టేషన్‌‌‌‌‌‌‌‌ బెయిల్‌‌‌‌‌‌‌‌ కోసం లంచం అడిగిన ఎస్సై

స్టేషన్‌‌‌‌‌‌‌‌ బెయిల్‌‌‌‌‌‌‌‌ కోసం లంచం అడిగిన ఎస్సై
  • ఏసీబీ ఆఫీసర్లు రావడంతో గోడ దూకి పరార్‌‌‌‌‌‌‌‌

రాయికల్, వెలుగు : స్టేషన్‌‌‌‌‌‌‌‌ బెయిల్‌‌‌‌‌‌‌‌ కోసం లంచం అడిగిన ఓ ఎస్సై ఏసీబీ ఆఫీసర్ల రాకను గుర్తించి గోడ దూకి పరార్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. జగిత్యాల జిల్లా రాయికల్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని పెద్దవాగు నుంచి ఇటిక్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి చెందిన ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 11న ఇసుక రవాణా చేస్తుండగా ఎస్సై అజయ్‌‌‌‌‌‌‌‌ పట్టుకున్నాడు. ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించి డ్రైవర్‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేశాడు. తర్వాత స్టేషన్‌‌‌‌‌‌‌‌ బెయిల్‌‌‌‌‌‌‌‌ తీసుకునేందుకు రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎస్సైని కలువగా రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

దీంతో అదే రోజు రూ.15 వేలు ఇచ్చి మిగతా డబ్బులు తర్వాత ఇచ్చేలా మాట్లాడుకున్నారు. పైసలు ఇవ్వాలని ఎస్సై అడగడంతో రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఏసీబీ ఆఫీసర్లను సంప్రదించాడు. వారి సూచనతో శుక్రవారం రాత్రి రూ. 10 వేలు ఇస్తానని ఎస్సైకి చెప్పడంతో మధ్యవర్తి అయిన పుల్లూరి రాజుకు ఇవ్వాలని ఎస్సై సూచించాడు. దీంతో రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజుకు డబ్బులు ఇచ్చి ఇద్దరూ కలిసి రాత్రి 10 గంటలకు ఎస్సైని కలిసేందుకు పీఎస్‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. ఆయన లేకపోవడంతో డబ్బులు తెచ్చామని ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి చెప్పారు. జగిత్యాల వెళ్లి తన క్వార్టర్‌‌‌‌‌‌‌‌కు తిరిగి వచ్చిన ఎస్సైకి ఏసీబీ ఆఫీసర్ల వాహనాలు కనిపించడంతో అనుమానం వచ్చి వెంటనే తన ఇంటి గోడ దూకి పారిపోయాడు. రూ. 10 వేలు తీసుకున్న రాజును పట్టుకొని కేసు నమోదు చేసి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరించారు. పరారీలో ఉన్న ఎస్సై కోసం గాలిస్తున్నామని చెప్పారు.