
బొంతలు మన దేశ సంస్కృతిలో భాగం. ఇప్పుడంటే రకరకాల దుప్పట్లు, మెత్తలు వచ్చాయి. కానీ, ఒకప్పుడు ఇండ్లు, కల్లాలు, పొలాల్లోనూ, మంచాలు, మంచెల మీదా హాయిగా నిద్రపోయేలా చేసింది బొంతలే. అందుకే ఇప్పటికీ దేశంలో చాలా చోట్ల బొంతలు కనిపిస్తాయి. అలాంటివే సిద్ది కావండ్స్. ఇవి కూడా బొంతలే. రంగురంగుల మొజాయిక్ పెయింటింగ్స్‌లా ఉండి, చూడగానే ఆకట్టుకునే వీటి వెనుక చెప్పుకోవాల్సిన విషయం ఉంది.
సాధారణంగా పాతవి, వాడేసిన బట్టలతో బొంతలు కుట్టడం తెలిసిందే. ఆ పద్ధతినే సిద్ధి ప్రజలు వాడుతున్నారు. కాకపోతే, వాటి తయారీ కొంచెం వేరుగా ఉంటుంది. ప్రతి బొంత కనీసం ఆరు పొరలు ఉండేలా చూస్తారు. అయితే, ఆరు పాత చీరలు లేదా దుస్తుల్ని ఒకదానిపై ఒకటి పెట్టి కుట్టరు. దానికో పద్ధతి ఉంది. మొదట తాము ఎంచుకున్న చీరల మీద కుట్లు ఉంటే వాటిని తీసేస్తారు. ఆ తర్వాత వాటిలో అవసరమైన చోట్ల పోగులు తీసేసి కొంచెం వదులు చేస్తారు. అదయ్యాక ఒక చీర మీద మరొక చీర ఉంచి, నలువైపులా అంచులు సమానంగా వచ్చేలా పెడతారు. ఆ రెండింటినీ ఒకదానిపై మరొకటి పెట్టాక, వాళ్లు అనుకుంటున్న డిజైన్ వచ్చేలా కింది చీరలోని పోగులు, పైచీరలోని పోగులను కలుపుతూ డిజైన్ వేస్తారు. ఈ డిజైన్లను పేపర్ మీద పెన్ను, పెన్సిల్‌తో బొమ్మల్లా వేసుకోరు. వాళ్లకు కావల్సిన డిజైన్‌ను మైండ్‌లో అనుకుంటారు. అలా ఒక చీరను మరొక చీరతో కలిపి కుడతారు. అలాగే మిగిలిన చీరలనూ కలిపి బొంత కుడతారు. కుటుంబం అవసరాన్ని బట్టి వేర్వేరు సైజుల్లో వీటిని కుడతారు. అతి పెద్ద బొంతలు ఆరడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పుతో ఉంటాయి. వాల్ హ్యాంగింగ్స్లానూ అలంకరిస్తున్నారు. అలాగే ఇప్పుడు డోర్మ్యాట్లు కూడా చేస్తున్నారు. రంగురంగుల చీరలు, పాత దుస్తులతో కుట్టిన బొంతలు చూసేందుకు అచ్చం మొజాయిక్ పెయింట్స్లా ఉంటాయి.
తిండి గింజలు, రొట్టెముక్క..
సిద్ధి తెగలోని ఏ కుటుంబం కూడా తాము తయారుచేసిన బొంతల్ని తమ ఇంటి అవసరాలకు వాడదు. ఒకరివి మరొకరు మార్చుకుంటారు. మిగిలినవి అమ్ముతారు. దీనికోసం ప్రతి ఊళ్లోనూ ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉంటుంది. బొంతల తయారీలో ఎక్స్పర్ట్ అయిన, ఒక పెద్దావిడ ఆ ఇంట్లో ఉంటుంది. ఊళ్లోని మహిళలకు బొంతలు కుట్టడం నేర్పించేది ఆమెనే. ఆమె తర్వాత మరొకరు ఆ బాధ్యతల్ని అందుకుంటారు. ఇది సిద్ధి తెగలో ఏండ్ల నుంచి వారసత్వంగా వస్తున్న ఆచారం. అంతేకాదు, ఆమె ఉండే ఇంటిని ఆడవాళ్లు ఏవైనా మీటింగ్‌లు పెట్టుకోవాలంటే వాడుకుంటారు. అయితే, ప్రతి బొంత మధ్యలోనూ కొన్ని తిండి గింజలు, లేదా చిన్న రొట్టె ముక్క పెట్టి కుడతారు. ఆ బొంత తీసుకున్న వాళ్ల ఇంట్లో పేదరికం పోవాలని, కడుపు నిండా తిండి దొరకాలని అలా చేస్తారు. ఇప్పుడు ఈ బొంతలు బాగా ఫేమస్ కావడంతో వీటి కోసం ఒక వెబ్సైట్( siddikavand.com) కూడా పెట్టారు. ఇందులోనే ఆర్డర్స్ తీసుకొని బొంతల్ని అమ్ముతున్నారు.
ఆఫ్రికా నుంచి వచ్చి..
కర్ణాటకలోని దట్టమైన పశ్చిమ కనుమల అడవుల్లో ఉంటారు సిద్ధి గిరిజనులు. ఈ తెగ ప్రజలు సుమారు ఐదు వందల ఏండ్ల కిందట ఆఫ్రికా నుంచి వచ్చినవాళ్లు. అప్పట్లో పోర్చుగీసు వ్యాపారులు, సైనికులు ఇండియాకు వస్తూ ఆఫ్రికాలోని సిద్ధి తెగ ప్రజల్లో కొన్ని వందల మందిని బానిసలుగా, పనివాళ్లుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత పోర్చుగీసువాళ్లు వెనక్కి వెళ్లిపోయినప్పటికీ సిద్ధి ప్రజలు మాత్రం మనదేశంలోనే ఉండిపోయారు. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్లో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో వీళ్లు కనిపిస్తారు. కొంకణి, మరాఠీ, కన్నడ కలగలిపిన భాష మాట్లాడతారు. కొన్నేండ్ల కిందట ఇండియాకు వచ్చి, మనతో కలిసిపోయినా ఇప్పటికీ తమ సంప్రదాయాల్లో కొన్నింటిని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటి వాటిలో ‘కావండ్’గా పిలిచే రంగురంగుల బొంతలు కుట్టే నైపుణ్యం ఒకటి. ఈ కావండ్స్ను కేవలం కర్ణాటకలోని సిద్ధి ప్రజలు మాత్రమే తయారుచేస్తున్నారు.