మిర్చి ట్రేడర్ల దోపిడీని అరికట్టాలని మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం

మిర్చి ట్రేడర్ల దోపిడీని అరికట్టాలని మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం
  • అడ్డుకున్న పోలీసులు 

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో క్వాలిటీ పేరుతో ధరల్లో వ్యత్యాసం చూపుతూ ట్రేడర్లు రైతులను దోపిడీ చేస్తున్నారని, న్యాయం చేయాలంటూ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఖమ్మం టూ టౌన్, ఖానాపురం హావేలి సీఐలు బాలకృష్ణ, భాను ప్రకాశ్ ఆందోళనకారులను అడ్డుకున్నారు. 

తర్వాత క్యాంపు ఆఫీసు ఇన్​చార్జికి లీడర్లు వినతిపత్రం అందజేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వెంకన్న, స్టేట్ లీడర్ డేవిడ్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఆవునూరి మధు, జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. మద్దతు ధర కల్పించి స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

ఎంఎస్పీ చట్టం తెచ్చి, మిర్చీకి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.30 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రెండు లక్షల రుణమాఫీ అమలు చేసి, కొత్త రుణాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకటరామిరెడ్డి, వై.ప్రకాశ్, మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగ, జిల్లా కార్యదర్శి వై.జానకి, పీడీఎస్ యూ జిల్లా కార్యదర్శి మస్తాన్  పాల్గొన్నారు.