కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు శరీరం ఇచ్చే ముందస్తు సంకేతాలు

కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు శరీరం ఇచ్చే ముందస్తు సంకేతాలు

మన శరీరంలోని ప్రతి అవయవానికీ ఓ ముఖ్యమైన పాత్ర ఉంటుంది. గుండె, మెదడు, ఊపిరితిత్తుల మాదిరిగానే మూత్రపిండాలు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. అందులో మూత్రపిండాల ప్రాథమిక బాధ్యత టాక్సిన్స్, రక్తాన్ని శుభ్రపరచడం, వ్యర్థాలను మూత్రంగా మార్చడం. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా అనారోగ్యం పాలవడం ఖాయం. అంతే కాదు ఇవి మన రక్తపోటును నియంత్రిస్తుంది. ఎర్ర రక్త కణాలను తయారు చేస్తాయి.. శరీరంలోని pH స్థాయిలను కూడా నియంత్రిస్తాయి. మూత్రపిండాలు ఇలా అనేక రకాల ముఖ్య పాత్రలను పోషిస్తుంది కాబట్టే ముఖ్యమైన అవయవాలల్లో ఇవి కూడా ఒకటి. అయితే కొన్ని సార్లు వాటిల్లో వచ్చే అసమానతలను ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యానికి ముందుగా కొన్ని హెచ్చరికలను కూడా జారీ చేస్తాయంటున్నారు. అయితే వాటిని ఎలా గుర్తించాలి అన్న విషయాన్ని పరిశీలిస్తే.. 

ముఖం, పాదాలలో వాపు, కళ్ళ చుట్టూ ఉబ్బడం

టాక్సిన్స్, వ్యర్థాలను బయటకు పంపడం మూత్రపిండాల ప్రధాన విధి. కానీ కొన్ని సార్లు అవి పనిచేయడం ఆపివేసినప్పుడు చేసే పనిలో ఆటంకం వస్తుంది. దీని ఫలితంగా టాక్సిన్స్, మలినాలతో పాటు శరీర కణజాలాలలో అదనపు నీరు, ఉప్పు చేరడం జరుగుతుంది. దాంతో ముఖం, పాదాలలో వాపు, కళ్ల చుట్టూ ఉబ్బినట్లుగా ఉంటుంది.

విపరీతమైన అలసట

మూత్రపిండాలు ఎర్ర రక్త కణాలను కూడా సృష్టిస్తాయి. ఈ ప్రక్రియలో ఆటంకం కలిగినపుడు రక్తహీనత తలెత్తుతుంది. దీని వల్ల శరీరంలోని మెదడు, కండరాలకు ఆక్సిజన్, పోషకాల సరఫరాకు అంతరాయం కలిగిస్తుంది. ఈ కారణం వల్ల  చాలా అలసటగా అనిపిస్తుంది.

మూత్ర విసర్జనలో మార్పులు

మూత్రపిండాల్లో ఏదైనా సమస్య ఉంటే వాటిని కొన్ని సింప్టమ్స్ ద్వారా గుర్తుపట్టవచ్చు. లేదా మూత్రవిసర్జనలో అనేక మార్పులు కూడా రావచ్చు. సాధారణంగా మూత్రపిండాలు మూత్రాన్ని ఉత్పత్తి చేయడంలో, రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో సహాయపడతాయి. దీని ద్వారా శరీరం నుండి వ్యర్థాలు విడుదలవుతాయి. అయితే కిడ్నీలు సక్రమంగా పనిచేయనప్పుడు మూత్ర నాళంలో లోపాలు ఏర్పడతాయి. కొందరు వ్యక్తులు తరచుగా మూత్రవిసర్జనకు వెళ్తూ ఉంటారు. మరికొందరికి మూత్రంలో రక్తం రావడం గమనించవచ్చు. నురుగు, బుడగతో కూడిన మూత్రం కూడా మూత్రపిండాల సమస్యను సూచిస్తుంది.

ఊపిరి ఆడకపోవడం

మన శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేయడానికి మూత్రపిండాలు బాధ్యత వహిస్తాయి. కిడ్నీ సమస్యలు ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడానికి దారితీయవచ్చు. ఇది శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. దీనినే ఫ్లూయిడ్ ఓవర్‌లోడ్ లేదా హైపర్‌వోలేమియా అని కూడా అంటారు. కొందరిలో ఛాతీ నొప్పి కూడా ఉండవచ్చు. 

పొడి లేదా దురద చర్మం

చర్మంపై దురద, పొడిబారడం మూత్రపిండాల వ్యాధికి సంకేతం. ఇది రక్తంలో ఖనిజాలు, పోషకాల అసమతుల్యతను సూచిస్తుంది. ఇది రక్తంలో భాస్వరం స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వల్ల కూడా కావచ్చు.

కిడ్నీలను ఎలా ఆరోగ్యంగా ఉంచాలి..?

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (NIDDKD) కొన్ని ఆరోగ్యకరమైన సూచనలను జారీ చేసింది, అవి శారీరక శ్రమను పెంచాలి, ఆరోగ్యకరమైన బరువును ఫాలో కావాలి, తగినంత నిద్ర పోవాలి, సమయానికి నిద్ర లేవాలి, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి, మధుమేహాన్ని నియంత్రించాలి, అధిక రక్తపోటు, ఒత్తిడిని తగ్గించుకోవాలి.

కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఎవరికి వచ్చే ప్రమాదం ఉంది.. ?

కిడ్నీ రీసెర్చ్ UK ప్రకారం.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, ఊబకాయం, మూత్రపిండాలు దెబ్బతిన్న కుటుంబ చరిత్ర ఉన్నవారు కిడ్నీ సమస్యలకు గురవుతారు. ఇంకా ధూమపానం, మద్యపానం, కొకైన్, హెరాయిన్, ఇతర 'హార్డ్ డ్రగ్స్' వాడకం కూడా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతాయి.