ఏప్రిల్​ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..

ఏప్రిల్​ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..

ఏడాదిలో 24 ఏకాదశిలు ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి  ఏకాదశి విష్ణువుకు అంకితం చేసింది. చైత్రమాసం శుక్ల పక్షం ఏకాదశి తిథి   ఏప్రిల్ 19న రానుంది. ఈ ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. ఈరోజు( ఏప్రిల్ 19)  విష్ణుపూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి వ్రతం ఆచరించి కథ వింటే పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. కామదా ఏకాదశి విశిష్టత.. ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. . .

చైత్ర శుద్ధ ఏకాదశిని 'కామదా ఏకాదశి', 'సౌమ్య ఏకాదశ', 'పాపవిమోచన ఏకాదశి', 'దమన ఏకాదశి' అని అంటారు. ఆ రోజున  ( ఏప్రిల్​: 19) ఉపవాస జాగరణ నియమాలున్నాయి. ఆ నియమాలను పాటిస్తూ శ్రీ మహా విష్ణువును పూజించవలసి ఉంటుంది. మరుసటి రోజున ద్వాదశి ఘడియలు ఉండగానే, శ్రీమహా విష్ణువును ఆరాధించి నైవేద్యాలు సమర్పించవలసి ఉంటుంది. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

పూర్వం పుండరీకుడు అనే రాజు కొలువులో, ఓ గంధర్వుడు పనిచేస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ గంధర్వుడు తన పట్ల నిర్లక్యంగా వ్యవహరించాడనే కోపంతో, రాక్షసుడిగా మారిపొమ్మని ఆ రాజు శపిస్తాడు. దాంతో ఆ గంధర్వుడు .. రాక్షసుడిగా మారిపోయి సంచరిస్తుంటాడు. అప్పుడు ఆ గంధర్వుడి భార్య 'కామద ఏకాదశి' వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆ వ్రత పుణ్య ఫలం చేత ఆ గంధర్వుడు యథా రూపాన్ని పొందుతాడు. అంతటి విశేషాన్నికలిగిన 'కామద ఏకాదశి' వ్రతాన్ని ఆచరించడం మరిచిపోకూడదు.

ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణుపూజ, ఉపవాసం, జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మ సింధులో చెప్పబడింది. పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి యిది పాపవిమోచన ఏకాదశి అయింది. స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యం రాదని చెప్పబడింది.

ఈరోజునే శ్రీకృష్ణునికి ఆందోళికోత్సవము జరుపుతారు. ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రమున కలికాలపు దోషాలు పాతాయి. కృష్ణ ప్రతిమగల ఉయ్యాలను ఊచితే, వేయి అపరాధాలైనా క్షమింపబడతాయి, కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంతమునందు విష్ణు సాయుజ్యము లభించగలదు.