మహాశివరాత్రి ప్రాముఖ్యత... చరిత్ర ఏమిటి?

 మహాశివరాత్రి ప్రాముఖ్యత... చరిత్ర ఏమిటి?

మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలి? మహాశివరాత్రి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? అంటే హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా నమ్ముతారు. పరమశివుడు పురుషుడిని సూచిస్తే ప్రకృతిని పార్వతి దేవి సూచిస్తుంది పార్వతీదేవి సూచిస్తుంది. సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 

కోరి కొలిచిన వారికి కొంగుబంగారం, అందరి కోరికలను తీర్చే బోళా శంకరుడు అయిన పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి ( 2024 మార్చి 8) న జరుపుకుంటారు. ఆ రోజు  శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతాయి. మహాశివరాత్రి పర్వదినం అంటే శివయ్యకు, శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు. ఆ రోజు ఎవరైతే భక్తితో శివుడిని పూజిస్తారో.. ఉపవాస, జాగరణ దీక్షలను ఆచరిస్తారో.. వారికి శుభాలు కలుగుతాయని, శివుడి కటాక్షం వారిపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.చెబుతారు. 

మహాశివరాత్రి శక్తి చైతన్యాల ప్రతీక

  హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలోనూ శివరాత్రి పండుగ వస్తుంది. అయితే వీటిని మాస శివరాత్రిగా పిలుస్తారు. కానీ సంవత్సరంలో ఒకేసారి మాఘ మాసంలోని కృష్ణపక్షంలో చతుర్థి నాడు మహాశివరాత్రి వస్తుంది.  ఇది శీతాకాలం ముగింపు .. వసంతకాలం, వేసవికాలంప్రారంభంలో వస్తుంది. ఇక మహాశివరాత్రి పర్వదినాన్ని శక్తి, ప్రేమ, ఏకత్వం స్వరూపంగా భావిస్తారు. శివరాత్రి పర్వదినాన శివయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.  ఓం నమ: శివాయ: పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. 


మహాశివరాత్రి గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ.. లింగోద్భవ వృత్తాంతం

 ఇక మహాశివరాత్రికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.  పురాణాల ప్రకారం... బ్రహ్మ.. విష్ణువు  మహేశ్వరంలో ఎవరు గొప్ప అన్న వాదన వచ్చినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరించాడని ఆది ...అంతాలను కనుకోవాలని బ్రహ్మ విష్ణువులకు చెప్పాడని పురాణాలు చెపుతున్నాయి. అయితే అది తెలుసుకోవడం కోసం మహా విష్ణువు శ్వేత వారాహ రూపంలో మూలం కనుక్కోవడానికి వెళితే, బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు. ఇద్దరూ మహా శివలింగానికి ఆది అంతాలను కనుక్కోలేకపోతారు. బ్రహ్మకు ఆ సమయంలో కేతకి పుష్పం(మొగలిపువ్వు) , గోవు దర్శనమిస్తాయి. బ్రహ్మ  శివలింగాన్ని కనుక్కున్నానని మొగలిపువ్వుకి, గోవుకు చెప్పి అదే విషయాన్ని విష్ణువు, శివుడితో చెప్పాలని చెబుతాడు. 

 బ్రహ్మ చెప్పినట్టుగానే కేతకి పుష్పం, గోవు రెండు బ్రహ్మ శివలింగం ఆది అంతాలను కనుక్కొన్నాడని  విష్ణువు, శివునికి చెబుతారు. అయితే గోవు ముఖంతో అబద్దం చెప్పి.. తోకతో నిజం చెప్పింది. వారిద్దరూ అబద్ధం చెబుతున్నారని గుర్తించిన శివుడు అబద్ధం చెప్పించిన బ్రహ్మకు భూలోకంలో గుడి పూజలు ఉండవని శాపాన్ని ఇస్తాడు. ఇక మొగలి పువ్వు పూజకు పనికిరానిదని శపిస్తాడు. గోమాత ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు, గోమాత ముఖం చూస్తే పాపమని, తోక చూస్తే పాప పరిహారమని శివుడు శపిస్తాడు. 

శ్రీమహావిష్ణువు నిజం చెప్పడం వల్ల ఆయన విశ్వవ్యాప్తంగా అన్నిచోట్ల పూజింపబడతాడని శివుడు అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారాన్ని, మోక్షం ఇచ్చే అధికారాన్ని కూడా మహావిష్ణువుకు శివ భగవానుడు ఇచ్చాడు.  ఇదంతా  లింగోద్భవ కాలంలోనే జరిగిందని శివపురాణంలోనూ, కూర్మా..  వాయు పురాణాలలోనూ ప్రధానంగా చెప్పబడింది.  ఇక బ్రహ్మ కూడా శివుడికి శాపం ఇస్తాడు.  నీవు లింగ రూపంలో పూజలు అందుకుంటావని తిరిగి శాపం ఇస్తాడు.  అప్పటి నుంచి మహా శివుడికి  లింగానికే  పూజాధికాలు నిర్వహించడం ప్రధానంగా కనిపిస్తుంది.

శివయ్య అభిషేక ప్రియుడు.. శివరాత్రి రోజు పూజల ఫలితం 

 మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరు అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేకిస్తారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ప్రతి శైవ క్షేత్రంలోనూ కొనసాగుతాయి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలను మారుమోగిపోతాయి. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివుడిని మనసులో లగ్నం చేసుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి, జాగరణ చేసి స్వామి కటాక్షం కోసం భక్తులు ప్రయత్నం చేస్తారు. 

ALSO READ :- ఉజ్జయినిలో శివ రాత్రి ఉత్సవాలు ప్రారంభం

మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం 6 గంటల సమయం నుండి రాత్రి రెండు గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకం, బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు ప్రధానంగా నమ్ముతారు. మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడిని ప్రార్థించడం ద్వారా ఎంతోమంది తమ పాపాలను అధిగమించి, పుణ్యలోకాలకు చేరుకున్నారని అనేక పురాణాలు ఇతిహాసాలలో చెప్పబడింది. అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా జరుపుకుంటారు.