ఓటీటీలో సైలెంట్ హిట్టయిన ‘సైలెన్స్’

ఓటీటీలో సైలెంట్ హిట్టయిన ‘సైలెన్స్’

ఒక సినిమా జనానికి నచ్చిందో లేదో బాక్సాఫీసు లెక్కలు చెప్పేస్తాయి అంటారు. కానీ ఓటీటీలో రిలీజయ్యే సినిమాల సక్సెస్‌‌ డబ్బుల లెక్కను బట్టి కాదు, దాన్ని చూసిన వారి సంఖ్యను బట్టి తెలుస్తుంది. కరోనా వల్ల థియేటర్లు మూతబడటంతో ఓటీటీలు ఊపందుకోవడం తెలిసిందే. రకరకాల ప్లాట్‌‌ఫామ్స్‌‌లో చాలా సినిమాలు రిలీజవుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌‌ సినిమాలు భారీగా బరిలోకి దిగుతున్నాయి. రీసెంట్‌‌గా ‘రాధే’ రిలీజై ఓటీటీ రికార్డులు బద్దలు కొట్టింది. అయితే సైలెంట్‌‌గా వచ్చి సక్సెస్‌‌ అయిన సినిమా ఒకటుంది. ఆ సంగతి ఇప్పుడు బైటికొచ్చింది. అదే.. ‘సైలెన్స్: కెన్ యు హియర్ ఇట్‌‌’. మనోజ్ బాజ్‌‌పేయ్ ప్రధాన పాత్రలో అబన్‌‌ బరూచా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రాచీ దేశాయ్, అర్జున్ మాధుర్‌‌‌‌ లాంటి వారంతా నటించారు.  ఈ చిత్రం ఓటీటీల్లో విడుదలైన వంద ఉత్తమ చిత్రాల లిస్టులో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. మార్చ్‌‌లో జీ5లో స్ట్రీమింగ్‌‌కి వచ్చిన ఈ సినిమాని ఇప్పటికీ చాలామంది చూస్తున్నారట. దానికి కారణాలు రెండు. సినిమా బాగుండటం, మనోజ్ బాజ్‌‌పేయ్ అద్భుతమైన నటన. ట్రెక్కింగ్‌‌కి వెళ్లిన కొందరు కుర్రాళ్లకి ఓ రిటైర్డ్ చీఫ్ జస్టిస్‌‌ కూతురి శవం కనిపిస్తుంది. ఆ కేసు ఏసీపీ అవినాష్‌‌ (మనోజ్‌‌) చేతికి వస్తుంది. అక్కడ్నుంచి అతను కేసును డీల్ చేసే విధానం టెరిఫిక్‌గా ఉంటుంది. నిశ్శబ్దం కూడా నిజాలు చెబుతుందనే కాన్ఫిడెన్స్‌‌తో ఏసీపీ వేసే ప్రతి స్టెప్‌‌ థ్రిల్లింగ్‌‌గా అనిపిస్తుంది. ఎంతో కూల్‌‌గా నడిచే ఈ స్టోరీలో తన పర్‌‌‌‌ఫార్మెన్స్‌‌తో మెరుపులు మెరిపించాడు మనోజ్. అతని ఎక్స్‌‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని సక్సెస్ చేయడంలో, టాప్ మూవీస్ లిస్టులో చేర్చడంలో ముఖ్య పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు. అయితే మనోజ్ మాత్రం ఇదంతా ప్రేక్షకుల ప్రేమ అని, వాళ్లకి తన నటన, సినిమా నచ్చడం ఆనందంగా ఉందని సింపుల్‌‌గా తేల్చేశాడు. ఓపక్క తను మనోజ్​ నటించిన ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్‌‌ సిరీస్‌‌ తమిళుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని, దాన్ని రిలీజ్ కాకుండా ఆపాలని తమిళనాడులో గొడవలు జరుగుతున్నాయి. మరోపక్క అతని సినిమా ‘సైలెన్స్‌‌’ ఇలా బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్టులో చేరింది. దాంతో ఒకేసారి రెండు రకాల ఫీలింగ్స్‌‌ చుట్టుముట్టాయి మనోజ్‌‌ని. ఏదేమైనా.. గ్రిప్పింగ్‌‌గా ఉండే నేరేషన్, మనసులు దోచే యాక్షన్ ఉంటే థియేటర్‌‌‌‌లో అయినా, ఓటీటీలో అయినా ఆదరణ దక్కడం ఖాయమని నిరూపించింది ‘సైలెన్స్’.