ఈ ముఠా మామూలుది కాదు. వెండి వ్యాపారులను టార్గెట్ చేస్తూ భారీ స్కామ్ లకు పాల్పడుతూ దొరికిపోయారు. వీళ్లు వ్యాపారులను మోసం చేసిన తీరును చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. వ్యాపారులను పరిచయం చేసుకుని.. ఒకటి రెండు సార్లు అసలు వెండిని అమ్మి నమ్మిస్తారు. ఆ తర్వాత నకిలీ వెండి చేతిలో పెట్టి లక్షల డబ్బుతో ఉడాయిస్తారు. 2026 ఏప్రిల్ 25న భారీ స్కామ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
వెండి వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని సికింద్రాబాద్ ప్రాంతంలో భారీ స్కామ్ కు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్ పేట్ డీసీపీ రక్షితమూర్తి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
శ్రీ జగదాంబ ఇండస్ట్రీస్ యజమాని హిరాలాల్ వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.ఈ అంతర్రాష్ట్ర ముఠా మొదటగా రెండు సమయాల్లో స్వచ్ఛమైన వెండిని చూపించి మూడోసారి నాణ్యతలేని వెండిని చూపించి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరి నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన 6.50 కిలోల వెండిని రికవరీ చేశామని తెలిపారు.
వెండి వ్యాపారులు ప్రతి లావాదేవీకి ముందు సరుకును కచ్చితంగా పరీక్షించుకోవాలని సూచించారు. కొత్త, రెగ్యులర్ కస్టమర్లపై కూడా పూర్తిగా నమ్మకం ఉంచకూడదని హెచ్చరించారు. ఈ ముఠా ఇప్పటికే మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో నేరాలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు.

