
- సింగరేణి ఉద్యోగి నుంచి రూ. 12 లక్షలు కాజేసిన యువతులు
- వాట్సప్‌లో చాటింగ్, వీడియో కాల్లో మాటలు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : స్టాక్ మార్కెట్ట్రేడింగ్ పేరుతో సింగరేణి ఉద్యోగికి వాట్సప్ కాల్ చేసిన ఇద్దరు యువతులు.. భారీగా లాభాలు వస్తాయని నమ్మించి మూడు నెలల్లో రూ. 12.30 లక్షలు కాజేశారు. చివరకు మోసపోయానని గుర్తించిన సదరు ఉద్యోగి భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూపాలపల్లికి చెందిన ఓ సింగరేణి ఉద్యోగికి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలన్న కోరిక ఉండేది. ఈ క్రమంలోనే ఇద్దరు యువతులు వాట్సప్ ద్వారా లైన్లోకి వచ్చి తన పేర్లు కావ్య అని, తాను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అడ్వైజర్‌ని అంటూ పరిచయం చేసుకుంది.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే 15 రోజుల్లోనే 50 శాతం లాభాలు సాధించవచ్చని నమ్మించింది. దీంతో ఆమె మాటలు నమ్మిన సదరు ఉద్యోగి కావ్య నంబర్‌కు రూ. లక్ష సెండ్ చేశారు. దీంతో 15 రోజుల్లోనే రూ.60 వేలు లాభం వచ్చిందని చెప్పి.. ఆ డబ్బును అతడి అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో తరచూ కావ్యతో వీడియో కాల్స్ మాట్లాడటం, చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత సంధ్య అనే మరో యువతి లైన్లోకి వచ్చింది. ఇలా ఇద్దరూ కలిసి తాము బెంగళూరులో ఉంటామని చెప్పి.. వీడియో కాల్స్, చాటింగ్ ద్వారా ఉద్యోగితో టచ్‌లో ఉండేవారు.
ఈ క్రమంలో వారు చెప్పినట్లుగా ఏప్రిల్ 24 నుంచి జూన్ 24 మధ్య మొత్తం రూ.12.31 లక్షలు కావ్య, సంధ్యకు పంపించాడు. ఆ తర్వాత ఆ ఇద్దరి ఫోన్లు స్విచాఫ్ అయిపోయాయి. దీంతో మోసపోయానని గుర్తించిన ఆ ఉద్యోగి భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో ఆ ఇద్దరు యువతులు ఉండేది కడపలోనేనని, డబ్బులు విత్ డ్రా చేసింది కూడా అక్కడేనని తేలింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.