కార్మిక సంఘాలతో చర్చించకపోవడం సరికాదు

 కార్మిక సంఘాలతో చర్చించకపోవడం సరికాదు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక సంఘాలతో చర్చించకుండానే యాజమాన్యం ప్రభుత్వంతో లాభాల్లో వాటా ప్రకటన ఏకపక్షంగా చేయించడం సరికాదని ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ప్రెసిడెంట్ ​సీతారామయ్య అన్నారు. ఏఐటీయూసీ ఆందోళనలతోనే​లాభాల్లో కార్మికులకు వాటాను ప్రకటించిందని పేర్కొన్నారు.  మంగళవారం గోదావరిఖని ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు సంఘం, యాజమాన్యంతో చర్చలు జరిపిన తర్వాతనే ప్రకటించే ఆనవాయితీ ఉండేదని గుర్తుచేశారు. కేసీఆర్ వచ్చిన తర్వాత నుంచి ఈ విధానాన్ని మార్పు చేశారని, ఇదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తుందని విమర్శించారు.  

కాంట్రాక్ట్ కార్మికుల వల్లే లాభాలు వస్తున్నాయని చెబుతున్న సింగరేణి యాజమాన్యం ఒక్కొక్కరికి రూ. 10 వేల బోనస్ ఇవ్వకుండా, కేవలం రూ.500 మాత్రమే పెంచిందని ఆరోపించారు. కార్మికుల పెండింగ్ సమస్యలైన సొంతింటి పథకం, మారు పేర్లు, కొత్త గనులు, అలవెన్స్ లపై ఆదాయపు పన్ను చెల్లింపు వంటివి పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కలిసినట్టు, యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ మీటింగ్​లో సంఘం నేతలు మడ్డి ఎల్లాగౌడ్, వైవీ రావు, కందుకూరి రాజరత్నం, జి. రవీందర్​, గౌతం, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.