
- మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్‌లో కాలనీలో ఘటన
నస్పూర్, వెలుగు: కుటుంబసభ్యులు చూస్తుండగానే నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కాలనీకి చెందిన ఓ సింగరేణి కార్మికుడు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హిమ్మతినగర్ కు చెందిన గోర్కే శ్రీనివాస్(40) శ్రీరాంపూర్ కాలనీకి చెందిన స్వరూపను 2014లో పెండ్లి చేసుకున్నాడు. రామకృష్ణాపూర్ లోని భగత్ సింగ్ నగర్ సింగరేణి క్వార్టర్ లో ఉంటున్నాడు. కొంతకాలంగా భార్య స్వరూపతో ఆర్థికపరమైన, కుటుంబ విషయాల్లో గొడవ జరుగుతోంది.
పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం నస్పూర్ మండలం సీతారాంపల్లి శివారులోని గోదావరి నది ఒడ్డున పుష్కర ఘాట్ మెట్ల వద్దకు వెళ్లి తల్లి రాజమ్మకు ఫోన్ చేశాడు. తాను చనిపోతున్నానని సీతారాంపల్లె గోదావరి ఒడ్డు వద్ద ఉన్నానని చెప్పాడు. ఆమె వెంటనే అల్లుడు రమేశ్ తో పాటు మరికొందరికి చెప్పడంతో వారు అక్కడికి చేరుకున్నారు.
మెట్ల వద్ద నిలుచుని ఉన్న శ్రీనివాస్‌ను బతిమిలాడినా వినకుండా వారి ముందే నదిలో దూకాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టి డెడ్‌బాడీని వెలికితీశారు. మృతుడి తల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామని నస్పూర్ ఎస్సై ఉపేందర్ రావు తెలిపారు.