
- సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కుట్ర పూరితంగానే 2024–-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాలు, వాటాను ప్రకటించడంలో యాజమాన్యం జాప్యం చేస్తోందని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీడీకే 11 ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
ఈ నెల 12న హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్‌లో లాభాలను ప్రకటించాలని, 35 శాతం వాటా త్వరగా చెల్లించాలని, గత సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్ల అమలు కోసం సర్క్యులర్లు జారీ చేయాలని అడిగితే దాటవేశారన్నారు. దీంతో ఆ మీటింగ్‌ను బహిష్కరించామని చెప్పారు. యాజమాన్యం మొండివైఖరి, కాలయాపన చేయడం వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, దీనిపై ఈ నెల 19న జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ సెక్రటరీ ఆరెల్లి పోషం, రంగు శ్రీను, ఎస్.వెంకట్ రెడ్డి, సిద్దమల్ల రాజు, సయ్యద్ సోహేల్, గండి ప్రసాద్, ఎం చక్రపాణి పాల్గొన్నారు. అంతకుముందు గని ఆవరణలోని తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.