మార్కెటింగ్ జాబ్ నుంచి మిస్​ ఇండియా వరకు

మార్కెటింగ్ జాబ్ నుంచి మిస్​ ఇండియా వరకు

ఈ  ఏడాది మొదట్లో ‘మిస్​ ఇండియా కర్నాటక’ పోటీల్లో విజేతగా నిలిచింది సీనీ శెట్టి. దాంతో, ఆమెకు కర్నాటక తరఫున ‘మిస్​ ఇండియా–2‌‌‌‌022’లో పాల్గొనే అవకాశం వచ్చింది. సినీ అమ్మానాన్న సొంతూరు బెంగళూరు. కానీ, తను పుట్టి పెరిగింది మాత్రం ముంబైలో. నాలుగేండ్ల వయసులోనే డాన్స్​ మీద ఇష్టం పెంచుకుంది సీనీ. అందుకు కారణం అడిగితే...  ‘‘డాన్స్​  నాలో ఉత్సాహాన్ని నింపేది.  క్లాసికల్ డాన్స్​లో భరతనాట్యం నాకు బాగా నచ్చింది. అందుకని పద్మినీ రాధాకృష్ణన్ దగ్గర భరతనాట్యం నేర్చుకున్నా. పద్నాలుగేండ్ల వయసులోనే మొదటి నృత్య ప్రదర్శన ఇచ్చా” అని చెప్పింది సీనీ. 

మోడల్​గా యాడ్స్​లో...
తన ప్యాషన్​ అయిన డాన్స్​ని ప్రొఫెషన్​గా మార్చుకోవాలి అనుకుంది సినీ. అందుకని సోషల్​మీడియాలో డాన్స్​ వీడియోలు పెట్టేది. అంతేకాదు మోడల్​గా ఎయిర్​టెల్, ఫ్రీ ఫైర్, ప్యాంటలూన్స్ యాడ్స్​ చేసింది కూడా. ప్యాషన్​తో పాటు స్టడీస్​ మీద కూడా దృష్టి పెట్టింది.  డిగ్రీలో అకౌంటింగ్, ఫైనాన్స్​  చదివింది. ఇంటర్న్​షిప్​ చేసి, ఒక మార్కెటింగ్ కంపెనీలో జాయిన్​ అయింది. ప్రస్తుతం చార్టెడ్ ఫైనాన్షియల్​ ఎనలిస్ట్ కోర్స్​ చేస్తోంది. 

ఇన్​స్పిరేషన్​ ఎవరంటే...
“మిస్​ ఇండియా అవ్వాలన్న కోరిక పుట్టడానికి కారణం.. ప్రియాంక చోప్రా. ‘ఎప్పుడూ  ఒక మూసలో ఇమిడేందుకు ప్రయత్నించే  బదులు గ్లాస్ సీలింగ్​ని బద్ధలుకొట్టండి’ అని ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు నాపై చాలా ప్రభావం చూపాయి. నేను ఈ స్థాయికి రావడానికి  అమ్మానాన్న ఎంకరేజ్​మెంట్​ కూడా ఉంది. ఆత్మగౌరవంతో బతకడం, విలువల్ని పాటించడం, ఇతరుల్ని అర్థం చేసుకోవడం వంటివి అమ్మమ్మని చూసి నేర్చుకున్నా” అంటోంది సీనీ. 

అదే నా బలం
‘‘ఒకేసారి శిఖరాన్ని అందుకోలేం. శిఖరం అంచు వరకు వెళ్లేందుకు చేసే ప్రయాణం చాలా గొప్పగా అనిపిస్తుంది. అందుకని జీవితంలో సాధించాలి అనుకున్న లక్ష్యాలను గౌరవించాలి. నా విషయానికి వస్తే... ఓటమిని ఒప్పుకోకపోవడం, కష్టపడి పనిచేయడం, ఇతరుల ఫీలింగ్స్​ని అర్థం చేసుకోవడం నా బలం” అంటున్న  సీనీకి ఆర్ట్, సోషల్ సర్వీస్, కుకింగ్, యోగతో పాటు ట్రావెలింగ్ అంటే ఇష్టం.