
హైదరాబాద్, వెలుగు: టీఎస్‌పీఎస్‌సీ పేపర్స్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏఈఈ, డీఏవో పేపర్స్ ను హైటెక్ కాపీయింగ్ చేసిన ఎలక్ట్రిసిటీ డీఈ రమేశ్ నేరాల చిట్టా బయటపడుతున్నది. ఏఈ, ఏఈఈ, డీఏవో పేపర్స్ అమ్మి రూ.10 కోట్లు సంపాదించడమే టార్గెట్‌గా హైటెక్ కాపీయింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఏఈ పేపర్‌ను 30 మందికి పైగా సప్లయ్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. దళారి శ్రీను ద్వారా 8 మందికి ఏఈ పేపర్ ను అమ్మినట్లు తేల్చింది. ఏఈఈ, డీఏవో పేపర్స్ కాపీయింగ్ కోసం ఏడుగురి వద్ద రూ.20 లక్షల చొప్పున రూ.కోటి వరకు వసూలు చేసినట్లు సిట్ గుర్తించింది. కాపీయింగ్ కోసం వినియోగించిన డిజిటల్ డివైజ్‌ల వివరాలను సేకరిస్తున్నది.
డీఈ రమేశ్‌పై అవినీతి ఆరోపణలు
పెద్దపల్లికి చెందిన రమేశ్ 2007లో ఎలక్ట్రిసిటీ ఏఈగా ఉద్యోగంలో చేరాడు. డీఈగా ప్రమోషన్ పొందాడు. రమేశ్‌పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. టీఎస్‌పీఎస్‌సీ సహా వివిధ పోటీ పరీక్షలకు హైటెక్ కాపీయింగ్ చేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితుడు సురేశ్ ద్వారా ఏఈ పేపర్ కొనుగోలు చేసి విక్రయించాడు. మూడు పేపర్స్ కోసం40 నుంచి 50 మంది అభ్యర్థులతో ఒప్పందం చేసుకున్నాడు. ఏఈఈ, డీఏవో పేపర్స్ కాపీయింగ్ చేసేందుకు ఏడుగురు అభ్యర్థులతో ఒక్కొక్కరి వద్ద రూ.20 లక్షలకు డీల్ చేసుకున్నాడు.
ఎగ్జామ్ సెంటర్ వద్ద కంట్రోల్ రూమ్
హైటెక్ కాపీయింగ్ డీల్ చేసుకున్న ఏడుగురు అభ్యర్థులు ఎగ్జాం రాసే సెంటర్స్ లోని ఇన్వెజిలేటర్స్‌తో రమేశ్ ఒప్పందం చేసుకున్నాడు. కాపీయింగ్ ద్వారా వచ్చిన డబ్బులో వాటా ఇస్తానని చెప్పాడు. ఇన్వెజిలేటర్‌కి ముందుగానే డబ్బు చెల్లించాడు. పరీక్ష ప్రారంభమైన10 నిమిషాల వ్యవధిలోనే ఇన్వెజిలేర్స్ వాట్సాప్‌లో పేపర్స్ షేర్ చేశారు. ఇలా రెండు సెంటర్లలోని ఏడుగురికి ఆన్సర్స్ చేరేలా ప్లాన్ చేసుకున్నాడు. పరీక్ష సెంటర్‌కు సమీపంలో కంట్రోల్ రూమ్‌తో యాక్సెస్ చేసుకున్నాడు. మరో నలుగురి సహకారంతో డిజిటల్ డివైజెస్ ద్వారా ఏడుగురికి సమాధానాలు అందించారు. రమేశ్‌కు సహకరించిన ఇన్వెజిలేటర్స్ వివరాలను సిట్ అధికారులు రాబట్టారు. హైటెక్ కాపీయింగ్ చేసేందుకు నలుగురు సహకరించినట్లు కూడా గుర్తించారు.
టీఎస్పీఎస్సీని రద్దు చేయాలె.. రాష్ట్రపతికి నిరుద్యోగుల లెటర్
ఎగ్జామ్స్ నిర్వహణలో విఫలమైన టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలని నిరుద్యోగులు కోరారు. కమిషన్‌లో సమర్థులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హైదరాబాద్ లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సుమారు వెయ్యి మంది అభ్యర్థులు లెటర్ రాశారు. పేపర్ల లీకేజీ ఘటనపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని లేఖలో కోరారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ లేఖను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయని అభ్యర్థులు చెబుతున్నారు.